ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేనలు సీట్ల పంపకాలు పూర్తి చేశాయి. ఇక, అభ్యర్థుల ప్రకటనే మిగిలింది. ఈ లోగా ఒక సభ పెట్టు కుంటే పోలా! అనే ఆలోచనతో మూడు పార్టీలూ సంయుక్తంగా సభకు శ్రీకారం చుట్టాయి. అన్ని కోణాల్లోనూ పరిశీలన చేసుకుని.. ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. ఆయనకు కుదిరిన రోజునే సభకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 17(ఆదివారం)న సభ నిర్వహించాలని సిద్ధమయ్యారు.
ఈ సభకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. గత వారం కిందట ఏలూరులో నిర్వహించిన సభకు తెలుగు జన కేతన విజయ జెండా అనిపేరు పెట్టారు. ఇక, ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సభా ప్రాంగణం వద్ద భూమి పూజ చేశారు. కొబ్బరికాయ కొట్టి పునాదులు వేశారు.
అంతకుముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కమిటీలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. చిలకలూరిపేట సభను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీడీపీ.. లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బీజేపీ, జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరం సభ కావడంతో పాటు.. ప్రధాని మోడీ కూడా వస్తున్నందున లక్షలాది మందితో విజయవంతం చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ సభకు హాజరవుతుండడంతో నారా లోకేష్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 15 లక్షల మందిని తీసుకురావాలని ప్లాన్ చేశారు. మరి ఎంత మంది వస్తారో చూడాలి.