తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగియడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టి ఇప్పుడు ఏపీ రాజకీయాలపైకి మళ్ళింది. మరో నాలుగు నెలలలో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో టిడిపీ-జనసేన కూటమి ఉమ్మడి కార్యచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నదానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే టిడిపి అధినేత చంద్రబాబుతో హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోపై, ఓట్ల తొలగింపు వ్యవహారంపై చర్చ జరిపినట్టుగా తెలుస్తోంది. నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఓట్ల తొలగింపుపై ఇచ్చిన ఫిర్యాదుపై కూడా ఈ ఇద్దరూ చర్చించారని తెలుస్తోంది. ఇక, ఫిబ్రవరి రెండో తేదీన ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ, మార్చి 6న పోలింగ్ జరగనుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక, తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారిందని, అదేవిధంగా ఏపీలోనూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళిక రచించాలని చంద్రబాబు, పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. టిడిపి 6 అంశాలు, జనసేన 5 అంశాలు కలిపి మొత్తం 11 అంశాలతో రూపొందించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాలు రచించాలని ఇద్దరు నేతలు భావించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు టిడిపి-జనసేన ఉమ్మడి కార్యచరణ కమిటీ, సమన్వయ కమిటీల పనితీరుపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.