మిగిలిన రాష్ట్రాల వరకు ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాల్నే తీసుకుంటే.. ఏపీ రాజకీయ నేతల మాటలు విన్నప్పుడు.. ఎంతసేపటికి పరనింద.. ఆత్మస్తుతి అన్నట్లుగా కనిపిస్తాయి. ఈ మధ్యన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు మరీ చీప్ గా ఉంటున్నాయి. వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించటం.. కుటుంబ సభ్యుల్ని రాజకీయ రొచ్చులోకి లాగటం మొదలు కొని.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువైంది.
తెలంగాణలో పోలిస్తే ఏపీలో ఈ జాతర మరింత ఎక్కువగా ఉంది. గతంలో మాదిరి గౌరవ మర్యాదల్ని ఇచ్చి పుచ్చుకోవటం అంతకంతకూ తగ్గిపోవటమే కాదు.. రాజకీయం వ్యక్తిగత వైరంగా.. అంతకు మించిన ద్వేషంగా మారిపోతున్న తీరు ఆందోళనకు గురి చేసేలా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కంటెంట్ ఉన్న రాజకీయ నాయకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. గతానికి వర్తమానానికి అస్సలు సంబంధం లేని రీతిలో పరిస్థితులు మారిపోతున్నాయి.
రాజకీయ నేత అంటే.. ఎటకారంగా మాట్లాడటం.. వెకిలి వ్యాఖ్యలు చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యల గురించి.. సమాజంలో చోటు చేసుకుంటున్న చెడు పోకడలతో పాటు.. చుట్టూ ఏం జరుగుతుందన్న సోయి లేని వైనం కనిపిస్తుంది. ఇక.. వివిధ అంశాలు.. చరిత్ర మీద అవగాహన అన్నదే లేని పరిస్థితి. కంటెంట్ మాట్లాడే విషయంలో ఏపీ నేతలతో పోలిస్తే తెలంగాణ నేతల్లో కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక.. విషయం ఏదైనా మాట్లాడే సత్తా ఉన్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. అంశం ఏదైనా.. రంగం మరేదైనా.. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలిగిన రాజకీయ అధినేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారితనమే నెం.1 అని చెబుతుంటారు. చంద్రబాబుకు ఎంతో కంటెంట్ ఉన్నా… వాడుక భాషలో చెప్పడం, సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడంలో రాటుదేలలేదు. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ విషయానికి వస్తే.. ఆయన కొన్ని అంశాల మీదనే మాట్లాడతారు తప్పించి.. ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్ర.. పోరాటాలు.. ఉద్యమాలు.. ఉద్యమ నేతలు.. వారి విధానాలు.. వారి పోరాటాల గురించిన అవగాహన పెద్దగా ఉండదు. ఇక.. పురాణాలు.. వివిధ మత గ్రంధాలు.. అందులోని అంశాల ప్రస్తావన చేయాల్సి వస్తే కేటీఆర్ తేలిపోతుంటారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత చదువు రాని వాడికి కూడా ఏదైనా సూటిగా అర్థమయ్యేలా చెప్పడంలో ఎవరైనా ఉన్నారా అంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గా చెబుతున్నారు. ఆయన మాట మీద నిలకడ ఉండదని.. తరచూ మాటలు మారుస్తారన్న విమర్శలు వినిపించినా.. అవన్నీ కూడా ఆయన మీద వేసిన మరకలే తప్పించి.. మరింకేమీ కాదంటున్నారు. వారాహి విజయయాత్ర పేరుతో పవన్ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు.. ప్రస్తావిస్తున్న అంశాలు.. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే క్రమంలో ఆయన వాడుతున్న భాషతో పాటు.. ఉదాహరణల్ని చూసినప్పుడు.. కేసీఆర్ తర్వాత సబ్జెక్టు మీద మాట్లాడే సత్తా ఉన్నోడు పవన్ ఒక్కడేనన్న అభిప్రాయం వ్యక్తంకాక మానదు.