దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం వరకు 10వేలకు దిగువన ఉన్న కేసుల సంఖ్య ఆదివారం నాటికి దాదాపుగా లక్షకు చేరుకుంది. మహారాష్ట్రలో ముమ్మరంగా కేసులు నమోదవుతుండగా…క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే మరోసారి దేశంలో లాక్ డౌన్ విధిస్తారన్న వదంతులు వ్యాపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కరోనా కట్టడిపై, లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 వ్యూహాలతో “కరోనా” ను కట్టడి చేయాలని మోడీ నిర్ణయించారు. “టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్”, కోవిడ్ నిబంధనలను పాటించడం, వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం వంటివి ఇందులో ప్రధానమైనవి.
ఏప్రిల్ 6 వ తేదీ నుంచి “కోవిడ్” నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ ఆదేశించారు. “కరోనా” కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్ కు కేంద్ర ప్రత్యేక బృందాలు పంపాలని నిర్ణయించారు. ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు వారాంతపు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రతి రోజు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రోజుకు దాదాపు 50వేల కేసులు నమోదవడంతో సీఎం ఉద్ధవ్ థాకరే ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలని భావించినా… ప్రజలకు కష్టాలు ఎదురవుతాయని పరిశ్రమల నాయకులు హెచ్చరించడంతో వారాంతపు లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది.