ప్రజాప్రభుత్వం అధికారాలకు అంటకత్తెర వేయటంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకున్నది. ఢిల్లీ సర్వీసు బిల్లు రాజ్యసభలో ఆమోదంపొందింది. బిల్లుపై మొదట రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. తర్వాత జరిగిన ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వంపై మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు దఖలుపడ్డాయి. ఢిల్లీపై ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వానిదే సంపూర్ణ అధికారమని సుప్రింకోర్టు తేల్చిచెప్పినా మోడీ లెక్కచేయకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు. ఒకపుడు సింగిల్ గా మోడీని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. అలాంటిది ఇపుడు ఇండియాకూటమిలో భాగస్తుడయ్యారు. దాంతో బీజేపీకి కేజ్రీవాలం పై బాగా మండుతోంది. అందుకనే కేంద్రప్రభుత్వ ప్రతినిధి లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ)ని ముందుపెట్టి ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చేయటానకి మోడీ రెడీ అయ్యారు. దీన్ని కేజ్రీవాల్ కోర్టులో సవాలుచేశారు.
కోర్టులో రెండువైపుల వాదనలు విన్నతర్వాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే ఢిల్లీపై పెత్తనం అని స్పష్టంగా సుప్రింకోర్టు తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పును మోడీ పాటించాలని అనుకోలేదు. అందుకనే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కోతపెడుతు ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇపుడు ఏకంగా బిల్లుపెట్టి సంఖ్యాబలంతో నెగ్గించుకున్నారు. నిజానికి మోడీ చర్యలు నూరుశాతం అప్రజాస్వామికమనే చెప్పాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా కేవలం కేంద్ర ప్రతినిధికే సర్వహక్కులు ఉండాలని అనుకోవటం దుర్మార్గమనే చెప్పాలి.
కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్ధితిల్లో ఉన్నారు. పార్లమెంటులో సంఖ్యాబలం కారణంగా తాను చేసిన తప్పును కూడా రైటే అని నిరూపించుకోగలిగటమే ప్రజాస్వామ్యంలోని గొప్పదనం. ఇపుడు మోడీ ప్రభుత్వం చేసిన పని పూర్తి అప్రజాస్వామ్యమని అందరికీ తెలుసు. అయినా మెజారిటి పార్టీలు మద్దతివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆప్ ను ఓడించటమే లక్ష్యంగా మోడీ పావులు కదుపుతున్నారు. మంచిపనులు చేసి జనాలకు చేరువ కావాల్సిన మోడీ అప్రజాస్వామ్య పద్దతుల్లో కేజ్రీవాల్ ప్రభుత్వానికి కత్తెర్లు వేస్తే జనాలు హర్షిస్తారా?