అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని వచ్చిన తరువాత మోదీ దేశీయ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ ఎలా ఉంది… ఆ నాలుగు రాష్ట్రాలలో కనీసం రెండు గెలవడం ఎలా అనే విషయంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ తన ఇంట్లో పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ వంటి అతి కొద్ది మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో రాష్ట్ర స్థాయిలో సంస్థాగతమైన మార్పులు చేయడం, కేంద్ర కేబినెట్లో మార్పులు చేయడంపై మోదీ ఈ నేతల అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణతో పాటు కొన్ని రాష్ట్రాలలో అధ్యక్షులు మారొచ్చని తెలుస్తోంది. తెలంగాణ, ఏపీల్లోనూ రాష్ట్ర అధ్యక్షుల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాలక పక్షం తప్పులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని.. స్వయంగా అమిత్ షా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసినా సోము వీర్రాజు ఆయన టీం ఆ ఊపును కొనసాగించలేకపోయారని.. వైసీపీ ముఖ్యనేతల విషయంలో సోము వీర్రాజు చాలా సాఫ్ట్‌గా ఉంటున్నారన్న అభిప్రాయం ఇప్పటికే కేంద్రంలోని పెద్దలకు ఉంది. విషయం ఇంతవరకు మోదీ వరకు వెళ్లనప్పటికీ అమిత్ షా తన పర్యటన సమయంలో తాను ఎంత తీవ్ర విమర్శలు చేసినా జీవీఎల్ దాన్ని తర్జుమా చేసినప్పుడు తేలికపర్చడంతో ఏపీ నేతల వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే మోదీ వద్ద ఏపీ విషయం కూడా ప్రస్తావించినట్లు పార్టీలో కీలక నేత ఒకరు అన్నారు.
మరోవైపు ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణల్లో కనీసం రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఒక్కటే బీజేపీ పాలనలో ఉంది. వచ్చే ఎన్నికలలో రాజస్థాన్ బీజేపీ పరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఛత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ బలంగా ఉండగా.. తెలంగాణలో ఇంతవరకు రెండో ప్లేసులో ఉన్నట్లు అనిపించిన బీజేపీ ఇప్పుడు మూడో ప్లేసుకు పడిపోయింది. ఇక అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో వర్గ విభేదాలు, కాంగ్రెస్ కూడా బలం పుంజుకుంటుండంతో గెలుపుపై ధీమాగా లేరు. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా గెలిచేలా పథక రచన చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను గెలవాలన్నది ఇప్పుడు బీజేపీ టార్గెట్. ఇందుకు అనుగుణంగా మోదీ మంత్రివర్గంలోనూ మార్పులు ఉండొచ్చు.