ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.సీఎం జగన్ చేస్తున్న అప్పులు..వాటికోసం వైసీపీ ప్రభుత్వం పడుతున్న తిప్పలు జాతీయ స్థాయిలో సైతం చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో అప్పుల వ్యవహారంపై చాలాకాలం కిందటే కేంద్రం ఫోకస్ పెట్టింది.
ఏపీలో కార్పొరేషన్ల ముసుగులో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల అక్రమాల నిగ్గుతేల్చాలని, ఏపీ అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు కేంద్రం గతంలో సంచలన ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను ఏజీ కార్యాలయ అధికారులు గతంలో సంప్రదించారు. పరిమితికి మించి చేసిన అప్పుల లెక్కలను అడిగారు. అంతేకాదు, కేంద్రానికి, ఆర్బీఐకి, ఏజీకి తెలియకుండా రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చిన వైనంపైనా వారు ఆరా తీశారు.
ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ఏపీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయడం నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు. తాము వైసీపీతో ఉన్నామనే భావన కల్గించేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా టీడీపీ, జనసేనలతో బిజెపి సన్నిహితంగా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల వ్యూహాలలో భాగంగానే బిజెపి తన భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ నిధులు విడుదల చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో మాదిరిగా ఈసారి ఎన్నికలలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉండకపోవచ్చని, అందుకే వైసీపీ వంటి పార్టీ మద్దతు అవసరం ఉంటుందన్న కారణంతోనే జగన్ కు మద్దతునిస్తోందని తెలుస్తోంది. ఏపీలో ఎవరితో జత కట్టాలి అన్న విషయంపై బిజెపికి పక్కా క్లారిటీ ఉంది, అదే సమయంలో వైసీపీకి కూడా క్లారిటీ ఉంది. అయితే ఆల్రెడీ మిత్ర పక్షం అనుకుంటున్న జనసేనకు, బీజేపీతో మిత్రపక్షం అవుదాం అనుకున్న టీడీపీకి ఈ విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.