ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్న రీతిలో గత ఏడాది కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి తర్వాత సమ్మె చేయాలన్న ఆలోచనలో ఉన్న ఉద్యోగ సంఘాలు…అనుకోకుండా ఆ ఆలోచనలను విరమించుకున్నాయి. ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుండడంతోనే సమ్మెకు ఉద్యోగుల సంఘాలు వెళ్లలేదని తెలుస్తోంది. అయితే, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వైసిపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.
ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ పత్రంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. ప్రభుత్వంపై గవర్నర్ కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేసిన ఘటన ఇదే చరిత్రలో తొలిసారి అని, ఇలా ఆంధ్రప్రదేశ్ లోనే జరగడం దురదృష్టమని అన్నారు. తమ డిమాండ్ల కోసం నిరసన వ్యక్తం చేయడానికి, ఆందోళన చేయడానికి అనుమతి దొరకని విపత్కర పరిస్థితిలలో ఏపీ ఉద్యోగులు ఉన్నారని నాగబాబు అన్నారు.
అటువంటి పరిస్థితుల్లోనే వారంతా గవర్నర్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు ఉన్న గవర్నర్ కు తమ బాధను చెప్పుకునే స్థితికి ఉద్యోగులను తీసుకువచ్చారని విమర్శించారు. వైసీపీ అసమర్ధ పాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు.