దాయాది దేశం పాకిస్థాన్ లెంపలేసుకుంది. “మేం మారిపోయాం. మా తప్పు తెలుసుకున్నాం.. మేమేంటో.. మా సత్తా ఏంటో కూడా తెలిసిపోయింది. భారత్‌తో కలిసి ముందుకు సాగాలని.. కోరుకుంటున్నాం“ అని సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. మూడు యుద్ధాలు జరిగిన తర్వాత.. పాకిస్థాన్ గుణపాఠాన్ని నేర్చుకుందని.. కశ్మీర్ లాంటి అంశాలపై కూర్చుని చర్చిద్దామని ప్రధాని మోడీకి ఆయన వినమ్రంగా పిలుపునిచ్చారు. కశ్మీర్లో శాంతిని కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు.
నిజానికి నిన్నగాక మొన్న.. అంటే రెండు వారాల కిందట.. మా దగ్గ అణ్వాయుధాలు ఉన్నాయి.. బారత్‌కు బుద్ధి చెబుతాం! అంటూ.. ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే.. రెండువారాలు తిరిగే సరికి దేశంలో పరిస్థితి మారిపోయింది.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కనీసం నిత్యవస సరకులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గోధుమల కొరత ఏర్పడి పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
పిండి సంక్షోభం ఏర్పడి అనేక చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. పిండిని దక్కించుకునేందుకు ప్రజలు రోజు అనేక గంటల పాటు రోడ్లపైనే వేచిచూస్తున్నారు. సాయుధ దళాల పహారాలో పంపిణీ చేస్తున్న పిండి వాహనాల చుట్టూ ప్రజలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా పాకిస్థాన్ గళం మారిపోవడం.. అది కూడా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత.. ఈ రేంజ్లో దిగిరావడం ఇదే తొలిసారి.
అయితే.. దీనికి కారణం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు అప్పులు తెచ్చుకోవాలంటే.. భారత్ వంటి బలమైన దేశం సిఫారసు అవసరం. అందుకే పాక్ వైఖరిలో అనూహ్య మార్పు వచ్చిందని అంటున్నారు.
ఇంతకీ పాక్ పీఎం ఏమన్నారంటే..
“భారత నాయకత్వానికి, ముఖ్యంగా ప్రధాని మోడీకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. కశ్మీర్ లాంటి అంశాలపై ఇప్పటికైనా కూర్చుని మాట్లాకుందాం. ఒకరితో ఒకరు గొడవపడి.. బాంబులు, మందుగుండు సామగ్రి వంటివాటిపై వనరులను, సమయాన్ని వృథా చేసుకుంటున్నాం. ఈ సమస్యలను పరిష్కరించుకుని శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం. భారత్‌తో మూడు సార్లు యుద్ధం చేసి మరిన్ని కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని తెచ్చుకున్నాం. ఇక, దీనిని కొనసాగించలేం“ అని వ్యాఖ్యానించారు. ఇక, దీనిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే.. ఎన్నికల ముంగిట పాక్‌తో తీసుకునే వైఖరి మోడీ విజయానికి ప్లస్ లేదా మైనస్ కావచ్చు. అందుకే దీనిని భారత్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.