హక్కుల కోసం పోరాడుతున్న అమరావతి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం వేళ.. బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం రాజధాని మహిళా రైతులు చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డ వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహిళలను ప్రపంచమంతా కీర్తిస్తున్న రోజున ఏపీలో మాత్రం మహిళలపై పోలీసులు జులుం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ యాప్ అంటూ తమది మహిళా ప్రభుత్వం అని చెప్పుకునే జగన్…ఇలా నిరసన తెలుపుతున్న మహిళలను అగౌరవపరచడంపై పలువురు మండిపడుతున్నారు. వెనుకా ముందు చేసుకోకుండా మహిళలపై చేయి చేసుకోవటం..లాఠీలతో విరుచుకుపడటమే కాదు.. దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకొని పోలీసు వాహనాల్లో కుక్కేసిన తీరు పలువురిని విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలో కొందరు మహిళల దుస్తులు కూడా చిరిగిపోయి అవమానపడ్డారు.
తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన ఈ పరిణామం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే చోటుచేసున్నప్పటికీ ఒక వర్గం మీడియా ఈ ఘటనను పెద్దగా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో, జగన్ సర్కార్ తీరును పలువురు ఎండగడుతున్నారు. తన ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశానని చెప్పుకునే జగన్…ఇంత జరుగుతున్నా స్పందించక పోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదీకాకుండా, హోం మంత్రిగా ఒక మహిళ ఉన్న రాష్ట్రంలో ఇంత దారుణం జరిగినా మేకతోటి సుచరిత కూడా స్పందించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అరెస్టులు.. తోపులాటలు.. మహిళల హాహాకారాలతో గడిచిన సంగతి తెలిసిందే. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పాదయాత్ర చేపట్టిన అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్న వైనం చర్చనీయాంశమైంది. ప్రకాశం బ్యారేజీ.. రాజధాని ప్రాంతమంతా రణరంగంగా మారింది. పోలీసుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరికొందరు తీవ్ర భావోద్వేగానికి గురైన మహిళలు ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ప్రయత్నించారు. పోలీసులు ఎంతలా ప్రయత్నించినా.. వారిని నిలువరించే ప్రయత్నం చేసినా.. మహిళా రైతులు మాత్రం కవాతు చేసిన ఉద్యమస్ఫూర్తిని చాటటం గమనార్హం. చివరకు పోలీసులు దౌర్జన్యంగా వారిని అదుపులోకి తీసుకొని వెళ్లిన వైనం పలువురిని కలచివేసింది.
కనకదుర్గమ్మను దర్శించుకోవాలనుకున్న మహిళా రైతుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆదివారం అర్థరాత్రి వేళలోనే… పోలీసులు నిర్బంధ చర్యలు అమలు చేశారు. ఐకాస నేతల ఇళ్ల వద్ద బలగాల్ని మెహరించారు. వారిని ఎక్కడకు వెళుతున్నారంటూ ప్రశ్నించటంతో పాటు.. అడుగడుగునా ఇనుప కంచెలు.. బారికేడ్లు అడ్డంగా పెట్టారు. అయితే.. అలాంటి అడ్డంకుల్ని దాటుకొని కొందరు మహిళలు కాలి నడకన.. మరికొందరు వాహనాల్లో సోమవారం తెల్లవారుజాము నాటికే విజయవాడకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికి కొందరు మాత్రం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు.
దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకురాలు రాయపాటి శైలజ.. మరికొందరు మహిళలు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకొని దుర్గగుడికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాల్ని పోలీసులు నీరు కార్చారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని అడ్డుకొని.. దొరికిన వారిని దొరికినట్లుగా పోలీసు వ్యానుల్లో పడేశారు. దాదాపు గంటన్నర పాటు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలని కూడా చూడకుండా ఇష్టానుసారం లాగి పడేసిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకొని మంగళగిరి స్టేషన్ కు తరలించారు. మూడు గంటల అనంతరం వారిని వదిలిపెట్టారు. అయితే.. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.