ప్రధాని మోడీ అపాయింట్ దొరకడం ఆషామాషీ కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీతో, మోడీతో సత్సంబంధాలున్న సీఎం జగన్ వంటి వారికి సైతం ప్రధాని మోడీని కలవాలంటే కొంత వెయిటింగ్ తప్పదు. ఇక, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు అయితే చాలా రోజుల ముందే ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయినా సరే ఒక్కో సందర్భంలో ప్రధాని అపాయింట్ మెంట్ లభించక చాలామంది నేతలు ఎదురు చూడాల్సిన పరిస్థితులుంటాయి. ఇక, చివరి నిమిషంలో అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యి వెనుతిరిగిన నేతలు కూడా ఉన్నారు.
ఇలా చాలా అరుదుగా దొరికే ప్రధాని అపాయింట్ మెంట్ ను అపోజిషన్ పార్టీకి చెందిన ఓ ఎంపీ అవలీలగా దొరకబుచ్చుకున్నారు. కేవలం అరగంటలోనే అడిగిన వెంటనే ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చేశారు. అంతేకాదు, సదరు ఎంపీ భుజం మీద ప్రధాని మోడీ చేయి వేసి మరీ వెన్ను తట్టడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎంపీ మరెవరో కాదు….కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
అరగంటలోనే మోడీ అపాయింట్ మెంట్ తీసుకొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీకి సంచలన ఫిర్యాదు చేశారు. తెలంగాణలో భారీ స్థాయిలో మైనింగ్ కుంభకోణం జరుగబోతోందని, సింగరేణికి అలాట్ చేసిన మైన్తో రూ.50 వేల కోట్ల స్కాం జరగతోందని మోడీ దృష్టికి వెంకట్ రెడ్డి తీసుకెళ్లారు. సింగరేణి విషయంలో కోల్ ఇండియా గైడ్ లైన్స్ పక్కన పెట్టి మరీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైన్ టెండర్ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో పరిస్థితులను ఆధారాలతో సహా ప్రధానికి వెల్లడించానని వెంకట్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో ఏయే రంగాల్లో అవినీతి జరుగుతోందో, సమస్యలు ఏమిటో ప్రధాని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ‘నమామి గంగ’ తరహాలో మూసీనది ప్రక్షాళన చేయాలని కోరానన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ ఏప్రిల్లో ప్రారభించాల్సి ఉందని, కానీ, జీఎంఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు.
ఈ అంశాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని, జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. నల్గొండ – మల్లెపల్లి, భువనగిరి – చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించానని చెప్పారు. వీటిపై మోడీ సానుకూలంగా స్పందించారని అన్నారు. అయితే, త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని, అందుకే అడగ్గానే మోడీ అపాయింట్ మెంట్ దొరికిందని అనుకుంటున్నారు. ఆ విషయంపై చర్చించేందుకే మోడీతో కోమటిరెడ్డి భేటీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.