టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్లు కొద్దిరోజుల క్రితం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వంశీ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ వివాదం నేపథ్యంలో తాజాగా వంశీపై పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. వల్లభనేని వంశీ అనే వాడితో మాకేమీ సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. వంశీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి, స్థానిక నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పల్లె రఘునాథరెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ ఎలాంటి విమర్శలూ చేయలేదని, ఆ కామెంట్లు చేసిన వల్లభనేని వంశీతో మాకేమి సంబంధమంటూ చిర్రెత్తిపోయారు.
ఈ రోజు ఏదో పోయిందని టీడీపీ గౌరవ సభలు పెట్టారని, ఎవరికి గౌరవం తక్కువైందో తెలియదని అన్నారు. చంద్రబాబు, రఘునాథ్ రెడ్డిలను గౌరవిస్తున్నామని, ఎక్కడికిపోయినా సరే మా సార్ రఘునాథ్ అంటానని చెప్పారు. టీడీపీ బీఫారమ్ మీద గెలిచిన వంశీ…చంద్రబాబును అంటే మేం ఏం చేస్తామంటూ కామెంట్లు చేశారు. వంశీతో తమ పార్టీకి సంబంధం లేదని శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి, ఈ కామెంట్లపై వంశీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.