ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. అవసరమైతే తాను మోడీని లేపేస్తానంటూ నానా పటోలే వ్యాఖ్యానించడం పెను దుమారం రేపుతోంది. మోడీని చంపగలనని, ఆయనను దూషించగలనని, అందుకే మోడీ తనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారని నానా పటోలే చేసిన కామెంట్లు మరాఠా రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
భండారా జిల్లాలోని లఖానీ తహసీల్ జిల్లాపరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు జరిపిన ఎన్నికల ప్రచార సమావేశంలో నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఒక్క స్కూల్ కూడా తన పేరు మీద లేదని, ఎప్పుడూ అందరికీ సాయం చేశానని నానా పటోలే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడం, మహిళలను ఇతర కీలక స్థానాల్లో నియమించడం వంటి పరిణామాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని చెప్పారు.
అయితే, పటోలే వ్యాఖ్యలను మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పంజాబ్ లో మోడీ కాన్వాయ్ ను 20 నిమిషాలపాటు నిలిపివేశారని, ఇప్పుడు ఏకంగా మోడీని చంపుతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం సతీమణిని రబ్రీదేవి అని కామెంట్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కానీ, ఏకంగా మోడీని చంపుతానంటూ బెదిరించిన వ్యక్తిపై మాత్రం ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని దుయ్యబట్టారు. ఇటువంటి వాటిని బీజేపీ సహించదని, పటోలే వ్యాఖ్యలపై తాము చూస్తూ ఊరుకోబోమని ఫడ్నవీజ్ హెచ్చరించారు.