సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద జోక్ చేశారు. బీజేపీని ఓడించటమే టార్గెట్ అని మీడియా సమావేశంలో చెప్పారు. లక్ష్యమైతే ఘనంగానే పెట్టుకున్నారు. అయితే దాన్ని సాధించేందుకు ఉన్న శక్తి ఎంత ? వనరులెంత ? అని చూస్తే శూన్యమనే సమాధానం వస్తుంది. క్షేత్రస్ధాయిలో వామపక్షాల పరిస్ధితి ఏమిటంటే దాదాపు క్షీణదశలో ఉందని అందరికీ తెలిసిందే. కేరళలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈమాత్రమైనా మీడియాలో కనబడుతోంది సీపీఎం.
వామపక్షాల్లో రెండోదైన సీపీఐని జనాలు పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. సీపీఐ కూడా మీడియా పుణ్యమానే ఇంకా జనాల్లో కనబడుతోంది. అప్పుడెప్పుడో వామపక్షాలంటే జనాల్లో ఆదరణుండేది కానీ క్రమంలో ఆ వైభవమంతా పోయి చివరకు మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇదే సమయంలో బీజేపీ కేంద్రంలో కానీ చాలా రాష్ట్రాల్లో బలంగా ఉంది. నైతికమో అనైతికమో ఏదో పద్దతిలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
కేంద్రంలో రెండోసారి గెలిచిన తర్వాత బీజేపీ మరింతగా బలపడిందనే చెప్పాలి. నరేంద్రమోడీ పరిపాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవమే. అయితే ప్రత్యామ్నాయం లేకపోవటం, బలమైన ప్రతిపక్షం లేకపోవటంతో జనాలకు మోడీయే దిక్కుగా కనబడుతున్నారు. మరో జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ కే ఇపుడు దిక్కులేకుండా ఉంది. రాజస్ధాన్, ఛత్తీస్ ఘర్ లో అధికారంలో ఉందన్న పేరే కానీ జాతీయస్ధాయిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.
మోడీని ఢీకొనేంత సీన్ కాంగ్రెస్ కే లేకపోతే ఇక క్షీణదశలో ఉన్న వామపక్షాల వల్ల ఏమవుతుంది. ఏదో ఎన్డీయేని అధికారంలో నుండి దించేస్తామని, మోడీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేయటానికి మాత్రమే వామపక్షాలు పనికొస్తాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా తెలుగు రాష్ట్రాల్లో దారణంగా తయారైంది. కొంతలో కొంత తెలంగాణాలోనే వామపక్షాలు ప్రత్యేకించి సీపీఎం మెరుగైన స్ధితిలో ఉంది. ఏపీలో అయితే ఏ ఎన్నికలో పోటీచేసినా కనీసం డిపాజిట్లు కూడా రావటం లేదు.
క్షేత్రస్ధాయిలో వాస్తవం ఇలాగుంటే సీతారామ్ మాత్రం మోడిని అధికారంలో నుండి దించేస్తామని, ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పటం పెద్ద జోక్ గానే ఉంది. దాదాపు 23 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పశ్చిమబెంగాల్లోనే ఇపుడు సీపీఎంకు దిక్కులేదు. వరసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయింది. మమతాబెనర్జీ దెబ్బకు సీపీఎం బెంగాల్లో పాతాళంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సిద్ధాంతాల పేరుతో కాకుండా వాస్తవ పరిస్ధితుల ఆధారంగా మిగిలిన పార్టీలతో కలిసి పనిచేస్తే వామపక్షాలు ఏమన్నా ప్రభావం చూపగలవేమో చూడాలి.