ఏపీ సీఎం జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానం ఏంటి? ఎందుకు.. జగన్ పై పదుల సంఖ్యలో సీబీఐ కేసులు ఉన్నా కూడా సజావుగా పాలన చేస్తున్నారు? ఎందుకు ప్రతిపక్షాలపై రెచ్చిపోతున్నారు? తను ఏం చేయాలనుకుంటే.. అది ఎలా చేయగలుగుతున్నారు? ఇదీ.. ఇప్పుడు మేధావులు చేస్తున్న ఆలోచన. నిజానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకుంటే.. అక్కడ అధికార పార్టీ మమతా బెనర్జీని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. ఒక ఆట ఆడుకుంటోంది. అక్కడ మమతకు కూడా భారీ ఎత్తున మద్దతు ఉంది. వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చారు.
అయినప్పటికీ.. ఇంత ప్రజా బలం మమతకు వచ్చినప్పటికీ.. మోడీ తన దూకుడు చూపిస్తున్నారు. ఇక్కడ మరో విషయం చర్చించుకోవాలి. మమతపై ఎలాంటి సీబీఐ కేసులు కూడా లేవు. శారదా చిట్‌ఫండ్ కుంభ కోణం ఉన్నప్పటికీ.. సీఎంగా మమతపై.. ఎలాంటి ఆరోపణలు లేవు. కేవలం తన పార్టీ నేతలపైనే ఆరోపణలు ఉన్నాయి. అంటే.. మోడీతో ఆమెకు ఎలాంటి అవసరం లేదు. ఆయనను కాకాపట్టాల్సిన అవసరం లేదు. దీంతో మోడీ ఇక్కడ రెచ్చిపోతున్నారు. కానీ, ఏపీని చూసుకుంటే.. మోడీ అవసరం జగన్‌కు చాలా ఉంది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. అయినప్పటికీ.. జగన్ దూకుడు పెంచుతున్నారు.
మరి మోడీ ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారనా? ఆయనకు 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు ఉన్నాయనా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. జగన్‌కు మోడీతో ఎంత అవసరం ఉందో.. మోడీకి కూడా కీలక సమయాల్లో జగన్ అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ శక్తులతో మోడీకి ఉన్న అవినాభావసంబంధాలు అందరికీతెలిసిందే. ఈ క్రమంలో ముఖేష్ అంబానీకి మిత్రుడైన.. నత్వానీకి.. జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇది మోడీ సూచనల మేరకే ఆయన చేశారు.
అదేవిధంగా.. అదానీ సంస్థలకు పవర్ ప్రాజెక్టులు ఇచ్చారు. ఇవి కూడా మోడీ సూచనల మేరకే చేశారు. ఇక, అమూల్ సంస్థకు ఏపీలో పచ్చజెండా ఊపారు. ప్రభుత్వ పాల సంస్థ విజయను సైతం పక్కన పెట్టి.. గుజరాత్‌కు చెందిన అమూల్‌ను నెత్తిన పెట్టుకున్నారు. ఇది కూడా మోడీ సూచలన మేరకే చేశారని ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే.. కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభలో మోడీకి వైసీపీ ఎంపీలు ఎంతో సహకరిస్తున్నారు. సో.. మోడీకి ఇన్ని విధాలా సహకారం ఉంది కనుకనే.. జగన్ విషయంలో మోడీ.. చూసీ చూడననట్టు వ్యవహరిస్తున్నారని.. అందుకే జగన్ నిశ్చితంగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.