అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలను వైసీపీ నేతలు కించపరిచిన వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, డ్యామేజి కంట్రోల్ చేసుకునేందుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. ఇక, ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా ఎవరి పాపాన వారే పోతారన్న రీతిలో వారిని క్షమించేశారు. అయితే, మహిళలను కించరపరచడం సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి అన్నారు.
ఆ తర్వాత భువనేశ్వరి వ్యాఖ్యలపై మరోసారి మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ నేపథ్యంలోనే తన తల్లిని దూషించిన వారిపై నారా లోకేష్ తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు. తాను చంద్రబాబు అంత సాఫ్ట్ కాదని, తన తల్లిని కించ పర్చిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని లోకేష్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి లెక్కలూ తేల్చేస్తామని హెచ్చరించారు. వరద బాధితుల్ని ఆదుకుంటున్నా…వైసీపీ నేతలు కనీసం మనుషుల్లా ప్రవర్తించడం లేదని మండిపడ్డారు.
ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నా.. అవమానించడం ఏంటని నిప్పులు చెరిగారు. ఏదో ఒక విషయంలో తమ కుటుంబ సభ్యులను బయటకులాగటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ ధ్వజమెత్తారు. నిన్నటివరకు టీడీపీ నేతలపై దాడులు చేసిన వైసీపీ నేతలు…సొంతపార్టీ వారిపై కూడా దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి క్షమించినా… ఈ విషయంలో తాను మాత్రం క్షమించబోనని.. తగ్గేదేలే అని…ప్రతీకారం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.