ఈ సోషల్ మీడియా జమానాలో రాజకీయ నాయకులు మీడియా ముందు, సభల్లో పబ్లిక్ గా మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా, సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో మంచి మాటలు, పంచ్ డైలాగ్ లు ఎంత వేగంగా వ్యాపిస్తాయో…చెడు మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలు అంతకన్నా వేగంగా వైరల్ అవుతాయి. ఈ కోవలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇటు మీడియాలో,అటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.
బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులో ఉన్నారంటూ మురళీధరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అంతేకాదు, ఆ సామాజిక వర్గాల నుంచి బీజేపీలో ఎక్కువమంది కార్యకర్తలుగా ఉన్నారని, అందుకే బీజేపీని మీడియా బ్రాహ్మణ, బనియాల పార్టీగా చూస్తోందని షాకింగ్ కామెంట్లు చేశారు. కానీ, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందంటూ తన వ్యాఖ్యలను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే మురళీధర్ వ్యాఖ్యలపూ విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను కించపరిచేలా మాట్లాడి వారిని అవమానించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాలపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మురళీధర్‌రావు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారని మురళీధర్‌రావు చెబుతున్నారు.