తెలుగుదేశం పార్టీ (టిడిపి) కార్యాలయాలపై జరిగిన దాడి అత్యంత హేయం అని తెలుగుదేశం ఎన్నారై సీనియర్ నేత ‘కోమటి జయరాం ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులు అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ తో చేసిన దాడులు అని పేర్కొన్నారు.
దాడులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినా ఎక్కడా పోలీసులు వచ్చి ఆపకపోవడాన్ని బట్టి వీటి వెనుక ఎవరున్నది, వారి ఉద్దేశాలు ఏంటనేది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు అని ‘కోమటి జయరాం’ ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రాజధాని అమరావతి, మంగళగిరి, విజయవాడ మరియు విశాఖపట్నం సహా మొత్తం 13 జిల్లాల్లోని ప్రధాన టీడీపీ కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని … పాలన చేతక కాక వాటిపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక వైసీపీ నేతలు గూండా గిరి చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించిన వైయస్ఆర్సిపి ప్రభుత్వం దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇలాంటి అరాచకాలకు పాల్పడిందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల పట్టుబడుతున్న గంజాయి వాహనాలు ఏపీ నుంచి వచ్చినవే అని ఆధారాలతో వార్తలు వస్తుంటే దానిని ప్రశ్నించడం తెలుగుదేశం తప్పా? దానికే దాడులు చేస్తారా? మీరు ఏం చేసినా ప్రతిపక్షాలు ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని ‘కోమటి జయరాం’ ప్రశ్నించారు.
ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది, పరిశ్రమలు పోతున్నాయి. కొత్తవి రావట్లేదు, యువతకు ఉపాధి లేదు, రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక నిరుద్యోగ సంక్షోభంతో విలవిల్లాడుతుంటే ఈ తాజాగా ఘటనలు రాష్ట్రాన్ని ఎటుతీసుకెళ్తాయో, ఇంకెంత నాశనం చేస్తాయో అర్థం కావడం లేదని ఆంధ్ర ఎన్నారైలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మీకు టైం దగ్గరపడుతోందని మీకు అర్థమైన విషయాన్ని మీలోని ఆవేశం, రౌడీయిజం, అరాచకాలే ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. “అధికార పార్టీ మూకలను ఆపడానికి స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం‘‘ అని కోమటి జయరాం అన్నారు.