ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై ముఖ్యంగా మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పేరు చెప్పకుండానే జగన్ బ్యాచ్‌ను ఆయన `420`(చీటర్స్)తో పోల్చారు. “420లకు నా విజన్ అర్థం కాదు“ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన దూరదృష్టి దేశం మొత్తం తెలుసుకుందని.. దేశం మొత్తం గుర్తించిందని తెలిపారు. విజన్ 2020 అంటే తనను 420 అంటూ వ్యాఖ్యలు చేశారని.. కానీ, ఇప్పుడు వాళ్లే 420లుగా మారారని అన్నారు. 420లకు తన విజన్ అర్థం కాదని నిప్పులు చెరిగారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును సమున్న త శిఖరాలకు చేర్చుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు అగ్రగామిగా ఉండాలన్నదే తన విజన్ అని తెలిపారు. ఆదాయాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసేవారు ఉండడం కన్నా..ఉద్యోగం ఇచ్చేవారు ఉండాలన్న లక్ష్యంతో పారిశ్రామిక ప్రగతికి అడుగులు వేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు థింక్ గ్లోబల్…యాక్ట్ లోకల్ అనే నినాదం ఉండేదన్న ఆయన ఇప్పుడు.. థింక్ గ్లోబల్…యాక్ట్ గ్లోబల్ నినాదం వినిపించేలా చేస్తున్నట్టు చెప్పారు.
అమరావతిపై అసత్య ప్రచారం!
అమరావతి రాజధానిపై వైసీపీ మూకలు అసత్య ప్రచారం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మా ణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పడం పెద్ద తప్పని అన్నారు. దీనినే పట్టుకుని ఐదేళ్లు కాలయాపన చేశారని అన్నారు. కానీ, అమరావతిని కొంత వరకు పూర్తి చేస్తే.. అది తనంతట తనే సంపాయించుకుంటుందని తెలిపారు. సైబరాబాద్ విషయంలోనూ పెద్దగా ఖర్చు పెట్టింది ఏమీలేదన్నారు. కేవలం భూమి, నీళ్లు మాత్రమే ఇచ్చామని, దీంతో హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా మారిందని, సంపద సృష్టిలోనూ ముందుందన్నారు. కానీ, ఇవన్నీ.. వైసీపీ నేతలకు కనిపించవని.. 420లకు నా విజన్ అర్ధం కాదని వ్యాఖ్యానించారు.