వైసీపీ నేతలు చేస్తున్న వ్యవహారం.. ఆ పార్టీకే నష్టం చేకూరుస్తోందా? అనవసర రాద్ధాంతంలో నాయకు లు.. ముందుకు సాగుతున్నారా? దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. ఉన్న కొద్దిపాటి హవా కూడా పోయే ప్రమాదం ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం రాజధాని రైతులు.. ఉద్యమిస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతిని ఏకైక రాజధాని చేయాలనే డిమాండ్‌తో వారు మలి విడత అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టారు.
సహజంగానే.. అధికార పార్టీ పెద్దలకు.. నాయకులకు కూడా ఈ పరిణామం ఇష్టం లేదు. తాము మూడు రాజధానులు అని చెబుతుంటే.. రైతులు.. అమరావతి కోసం పట్టుబట్టడం.. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడం.. ఉత్తరాంధ్రపై ప్రభావం చూపించడం ఖాయమనే సంకేతాలు.. సర్వే రిపోర్టులు పార్టీ అధినాయకత్వానికి అందడం.. నేపథ్యంలో వైసీపీ నాయకులు.. పాదయాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా మహిళా రైతులపైనే వారు ఆరోపణలకు దిగుతున్నారు.
వైసీపీ సోషల్ మీడియా వేదికగా.. నాయకులు చేసిన పోస్టులు తీవ్ర వివాదానికి దారితీశాయి. పాదయాత్ర లో పురుషులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. దీనిని మహిళలు కూడా అడ్డుకోవడం లేద ని.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి చేసిన కొన్ని వీడియోలు.. కలకలం రేపాయి. అయితే.. అవి ఇక్కడివి కావని.. తమిళనాడులో జరిగిన పాదయాత్ర సందర్భంగా జరిగిన రగడ అని.. చాలా సమయం గడిచిన తర్వాత.. తెలిసింది. దీనిపై నెటిజన్లు సైతం ఫైరయ్యారు.
దీంతో వైసీపీ సోషల్ మీడియా నుంచి ఈ పోస్టులను పక్కన పెట్టారు. కట్ చేస్తే.. ఈ పరిణామంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నంత వరకు ఓకే కానీ.. రాజధాని మహిళలపై ఇలాంటి విమర్శలు చేస్తారా? అంటూ.. నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉన్న సింపతీ కూడా పోయిందనే టాక్ వినిపిస్తోంది. తాను అనుకున్నది సాధించేందుకు వైసీపీ నాయకులు ఎంతకైనా బరితెగిస్తున్నారని.. నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో వైసీపీ ఇప్పుడు అంతర్మథనంలో పడింది.