ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చార్జిషీట్ లో చేర్చిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపుతోంది. లిక్కర్ క్వీన్ పేరు చార్జిషీటులో 28 సార్లు ప్రస్తావించారంటూ కవితనుద్దేశించి బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపింది. దీంతో, రాజగోపాల్ అన్న… తొందరపడకు, మాట జారకు అంటూ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కవిత హితవు పలికారు.
28 సార్లు నా పేరు చెప్పించినా, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు అంటూ రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చారు. దీంతో, తాజాగా కవిత వ్యాఖ్యలపై రాజగోపాల్ కౌంటర్ ఇచ్చారు. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా… నువ్వు లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం అంటూ రాజగోపాల్ సెటైర్లు వేశారు. అంతేకాదు, లిక్కర్ స్కాం వ్యవహారం నుంచి కవితను ఎవరూ కాపాడలేరంటూ కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇక, గతంలో కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తనపై విష ప్రచారం చేశారని, తద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాం చార్జిషీట్ లో కవిత పేరు చేర్చడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవిత పేరును చార్జిషీట్ లో చేర్చారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కవిత న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కేసీఆర్ తో కూడా కవిత ఈ విషయంపై భేటీ కాబోతున్నారట.