రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ కీలక నిర్ణయం వెలువరించారు.ఇకపై పార్టీ శాశ్వత అధ్య క్షుడిగా తానే ఉంటానని అంటున్నారీయన. ఇదే ఇప్పుడు పెను సంచలనం అవుతోంది. ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీలోనూ ఆ విధంగా జరగలేదే అని విస్తుబోతోంది విపక్షం. ఒక వివరం ఆధారంగా శివసేన కూడా ఇలాంటి పనే చేసినా కూడా ప్రతి ఐదేళ్లకో, రెండేళ్లకో సంబంధిత వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తూ ఉండేదని కనుక శాశ్వత అధ్యక్షుడు అన్న మాట చెల్లనే చెల్లదని ప్రముఖ మీడియాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రజా స్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు ఎన్నికలు ఎంత అవసరమో అదేవిధంగా పార్టీలకు సంబంధించి నూతన కార్యవర్గాల ఏర్పాటు, అధ్యక్షుడి మార్పు, కొత్త వారి చేర్పు అన్నవి కూడా అంతే ముఖ్యం. కనుక జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఈసీ ఆమోదించడం అంత వీజీ కాదు అని తేలుతుంది.
ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఐదేళ్లకు ఓ సారి పాలక పార్టీ మారుతుంటాయి. కొన్ని సార్లు ప్రజాభీష్టం బాగుంటే అవే కొనసాగుతాయి.. కొద్ది పాటి సీట్ల తేడాతో ! కానీ ఎన్నిక మాత్రం తప్పని సరి! ఒకవేళ పార్టీల వరకూ కొన్ని ప్రత్యేకం అనుకునే సందర్భాల్లో జరిగే అంగీకారానికి అనుగుణంగా ఏకగ్రీవాలు ఉన్నా కూడా అది కూడా నోటిఫికేషన్ ప్రకారమే జరుగుతుంది. అంతేకానీ తత్ విరుద్ధంగా ఏమీ జరగవు.అంటే ఓ రాజకీయ పార్టీ అన్నాక కార్యవర్గం, సభ్యత్వ నమోదు, రిజిస్ట్రేషన్ రెన్యువల్, బై లా సబ్మిషన్ ఇలా చాలా తతంగమే ఉంటుంది. వీటితో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ జరిగాకనే గుర్తింపు పార్టీల మనుగడ కానీ కొనసాగింపు కానీ పోటీ చేసేందుకు పొందే అర్హత కానీ ఆధారపడి ఉంటాయి. కానీ జగన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా శాశ్వత నాయకుడ్ని తానే అని ప్రకటించుకోవడం ఆశ్చర్యకరం అని విశ్లేషకులు అంటున్నారు.