కొన్ని కొన్ని వాస్తవాలు.. పార్టీలకు రుచించకపోవచ్చు. కానీ, వాస్తవాలను ఎవరూ మార్చలేరు కదా! ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ విషయంలోనూ ఇలానే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వైసీపీకి గట్టి పట్టుంది. 2014లో పార్టీ అధికారంలోకి రాకపో యినా.. ఎస్సీ నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంది. కీలకమైన టీడీపీ నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది.
ఇక, 2019లోనూ వైసీపీ ఎస్సీ నియోజకవర్గాల్లో ఘన విజయం దక్కించుకుంది. ఒక్క కొండపి, (ఉమ్మడి ప్రకాశం జిల్లా), రాజోలు(తూర్పు)లో మినహా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయదుందుభి మోగించింది. మొత్తం ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ రెండు మినహా అన్నీ వైసీపీ వశం అయ్యాయి. అయితే.. ఇప్పుడు ఇవే నియోజకవర్గాల్లో సెగలు పొగలు కక్కుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఎస్సీ నియోజకవర్గం అంటే.. వైసీపీకి కంచుకోట అనే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.
ఎక్కడికక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండడంతోపాటు ప్రభుత్వ తీరుపైనా ఎస్సీ సామాజిక వర్గాల్లో అపనమ్మకం ఏర్పడిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ప్రధానంగా ఎస్సీ కార్పరేషన్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గాలకు రుణాలు చేరువ య్యాయి. అదేవిధంగా విదేశీ విద్యకు అనేక మంది సర్కారు చేసిన సాయంతో తరలివెళ్లారు. ఇక, కార్పొరేషన్ ద్వారా రుణాలను అందరికీ చేరువ చేశారు.
అయితే..ఇప్పుడు గడిచిన నాలుగేళ్ల కాలంలో ఎస్సీలకు ప్రత్యేకించి ఉన్న కార్పొరేషన్ ద్వారా ఒరిగింది ఏమీ కనిపించడం లేదనే వాదన ఎస్సీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. అదేసమయంలో కార్పొరేషన్ ద్వా రా జరిగిన మేలు కూడా ఏమీ కనిపించడం లేదని ఎస్సీ సామాజికవ ర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా కేవలం నామ్ కే వాస్తే అన్నట్టుగా పదవుల్లో ఉన్నారే తప్ప.. తమను పట్టించుకోవ డం లేదని ఎస్సీ వర్గాలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఎస్సీలపై దాడులు, ఇతరత్రా కేసులు వంటివి భారీగా చర్చకు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బలమైన ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీకి తీవ్ర వ్యతిరేక కనిపిస్తోందని ఆన్లైన్ చానెళ్లు చేస్తున్న వివిధ సర్వేల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, దీనిని వైసీపీ నాయకులు లైట్‌గా తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం నవరత్నాల హామీలను అమలు చేస్తోందని.. ఎస్సీలకు కూడా మేలు జరుగుతోందని.. వ్యతిరేకత ఏమీ లేదని వారు అంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పు ప్రారంభమైందని ఆన్లైన్ చానెళ్ల సర్వేలు స్పష్టం చేస్తుండడం గమనార్హం.