జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నంతనే ముఖం చిరాగ్గా పెట్టేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వారిని నిశితంగా చూస్తే.. తమను తమకు అర్థమయ్యే బాషలో సినిమా చూపించే మొనగాడు పవన్ లో కనిపిస్తారు. ఎలాంటి రాజకీయ అండ.. మీడియా బలం లేకుండా.. కేవలం తన ఛరిష్మాతో జనంలోకి వచ్చిన పవన్ కల్యాణ్ ను అదే పనిగా టార్గెట్ చేయటం చూస్తున్నదే. ప్యాకేజ్ స్టార్ తెలుగు రాజకీయాల్లో విపరీతమైన విమర్శల్ని ఎదుర్కొన్న రాజకీయ పార్టీ అధినేతగా పవన్ ను చెప్పాలి. ఎందుకుంటే.. పవన్ కు క్షమాగుణం ఎక్కువ.
తెలుగు రాజకీయాల్ని సునిశితంగా చూస్తే.. దెబ్బకు రెండు దెబ్బలు కొట్టే వారంటే భయంతో పాటు భక్తి.. విపరీతమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తారు. కారణం.. అలాంటోడితో మనకెందుకు గొడవని చెప్పేస్తారు. కానీ.. పవన్ మాత్రం సాఫ్ట్ కార్నర్ గా కనిపిస్తారు. తరచూ ఆయన్ను టార్గెట్ చేస్తుంటారు. ఎందుకిలా? అంటే.. తనను ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడే వారి విషయంలో పవన్ విపరీతమైన క్షమాభిక్ష కలిగి ఉంటారు. మైకులు పగిలిపోయేలా పవన్ ను విమర్శలు చేసి.. ఆ తర్వాత తమకు పవన్ ఎదురుపడితే విపరీతమైన గౌరవాన్ని ప్రదర్శించే వారిని పవన్ పట్టించుకోరు. వారిపై కన్నెర్ర చేయరు. అందుకే.. పవన్ అంటే ఒకలాంటి లెక్కలేనితనం కనిపిస్తుంది. తాము ఏమన్నా.. తమను ఏమనడు.. తమను.. తమ మాటల్ని పర్సనల్ గా తీసుకోరన్న భరోసానే దీనికి కారణం.
పవన్ పర్సనల్స్ ను అదే పనిగా టచ్ చేసే వారు.. తమ వ్యాఖ్యలన్ని రాజకీయ కోణంలోనే చూడాలన్నట్లుగా మాట్లాడతారు. అలాంటి వారిపై పవన్ ఘాటుగా రియాక్టు అయితే మాత్రం తట్టుకోలేరు. పవన్ ను ఏమైనా అనేసే హక్కు తమకు సొంతమన్నట్లుగా.. ఆయన మీద తమకే పేటెంట్ ఉన్నట్లుగా ఆయన ప్రత్యర్థులు అదే పనిగా విమర్శలు చేస్తుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాలపై విపరతంగా విరుచుకుపడుతుంటారు.
ఇదంతా చేస్తూ.. ప్యాకేజీ స్టార్.. పావలా స్టార్ అంటూ బిరుదులు ఇచ్చేస్తుంటారు. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు.. ఆరోపణలు మామూలే. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అనుకున్నా.. ప్యాకేజీ స్టార్ అన్న మాటను ఇన్నిసార్లు వాడేసిన ఆయన ప్రత్యర్థులు.. అందుకు సంబంధించిన ఒకే ఒక్క ఆధారాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు? అన్నది ప్రశ్న. పావలా పవన్ కల్యాణ్ విలువ ఏమీ లేదని చెప్పేటోళ్లు.. తమ విలువైన టైంను పవన్ కోసం ఎందుకు వేస్టు చేస్తున్నట్లు? అన్న లాజిక్ ను అడిగితే మాత్రం.. ప్యాకేజీ స్టార్ అంటూ అర్థం లేని ఆరోపణలు చేయటమే తప్పించి.. సూటిగా సమాధానం చెప్పలేనోళ్ల గురించి ఎంత మాట్లాడినా వేస్టేనని చెప్పక తప్పదు.