జగనన్న అంటూ.. ముద్దుగా పిలుచుకునే వైసీపీ ఎమ్మెల్యేలు .. ఇప్పుడు అదే అన్నకు నిద్రలేకుండా చేశారు. ఏ పార్టీ అయితే.. నాశనం కావాలని.. కనిపించకుండా పోవాలని.. ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్ కోరుకున్నారో.. ఇప్పుడు ఆయనకే వినాశనం ఎదురైంది. అసలు మండలిలో టీడీపీ నేతలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న జగన్..అనేక సందర్భాల్లో పార్టీ నేతలకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.
“మండలిలో ఎటు చూసినా.. మన వాళ్లే కనిపించాలి“ అని జగన్ పలు సందర్భాల్లో అంతర్గత సమావేశాల్లో చెప్పేవారు. దీనికి తగినట్టుగానే ఆయన పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. ఎక్కడా టీడీపికి అవకాశం లేకుండా చేయాలని నిర్ణయించారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పడు మరోసారి తన పార్టీని తనే కూకటివేళ్లతో పెకలించి వేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే.. ప్రతిపక్షాన్ని ఎంతగా అణిచి వేస్తే.. అంతగా సానుభూతి పెరుగుతుందనే రాజకీయ ఫార్ములా ను జగన్ మరిచిపోయారనే వాదన ఉంది. ఇదే ఇప్పుడు ఆయన పుట్టిముంచిందని అంటున్నారు. నిజానికి ఈ నెల 29 తర్వాత.. మండలిలో టీడీపీ బలం చాలా వరకు తగ్గిపోతుంది. నారా లోకేష్ సహా.. అనేక మంది పదవులకు ఈ నెల 29 డెడ్ లైన్. తర్వాత.. మండలిలో వైసీపీ బలం పెరుగుతుందని అనుకున్నారు.
దీంతో మండలిలో టీడీపీ కనిపించదని.. కనిపించకుండా చేయాలని కూడా వైసీపీ అధినేత జగన్ అంచనా వేసుకున్నారు. అయితే.. దీనికి భిన్నంగా.. ఏ పార్టీని ఆయన నాశనం చేయాలని అనుకున్నారో.. ఆ పార్టీ తిరిగి పుంజుకుంది. సంఖ్యాబలం లేకపోయినా.. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థిని గెలిపించుకున్న తీరు.. పార్టీ ఏ తరహా వ్యూహంతో ముందుకు సాగుతోందో స్పష్టం చేస్తోంది. ఇక్కడ టీడీపీ ఎలాంటి దొడ్డిదారిలోనూ పయనించలేదు. కేవలం జగన్ చేసుకున్న స్వయంకృతం.. అతి నమ్మకం.. అనే రెండు విషయాలు .. ఆయనను ఓడించాయనేది పరిశీలకులు చెబుతున్న మాట.