వైఎస్సార్ సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ `అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ` జాతీయాధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ వేసిన రిట్ పిటిషన్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తాము రిజిస్టర్ చేయించుకున్నామని, వైఎస్సార్ పేరును వైఎస్సార్సీపీ వాడకుండా చూడాలని పై ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం తాజాగా సుప్రీం కోర్టుకు చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. సుప్రీం కోర్టు న్యాయవాది నాసిర్ సహాయంతో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, స్వయాన న్యాయవాది అయిన షేక్ మహబూబ్ బాషా ఈ కేసులో ఇన్ పర్స న్ గా వాదించనుండడం విశేషం.
తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటుచేస్తున్న పార్టీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతివ్వలేదని, వైఎస్ఆర్ అనే పదం వాడకుండా చూడాలని ఇప్పటికే తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని మహబూబ్ బాషా తెలిపారు. అయితే, గతంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అన్న పదం రాయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.
తనకు పార్టీ ఇచ్చిన బీఫారమ్ లో పేరు వేరని, షోకాజ్ నోటీసులో పేరు వేరని రఘురామకృష్ణరాజు పాయింట్ అవుట్ చేయడంతో ఈ విషయం చినికి చినికి గాలివానై సుప్రీం వరకు చేరిందన్న విమర్శలు వస్తున్నాయి. రాజుగారిని గెలకడంతో…పార్టీ పేరు వ్యవహారం నుంచే ఆయన గేమ్ మొదలుపెట్టారని…ఇపుడు రాజద్రోహం 124-ఏ రద్దు ఉద్యమం వరకు అది వెళ్లిందని నెటిజన్లు అంటున్నారు.