వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని తిరుపతిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ తో సహా మొత్తం 13 మంది కౌన్సిలర్లు వైకాపాకు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పుంగనూరు రాజకీయం వేడెక్కింది. ఆదివారం పుంగనూరులో పార్టీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం అవ్వాలని భావించారు. అయితే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మిథున్ రెడ్డి అక్కడికి వెళితే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ముందస్తు సమాచారం అందుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజాము నుంచే ఎంపీ నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పుంగనూరు వెళ్ళొద్దని మిథున్ రెడ్డికి స్పష్టంగా వివరించారు. అయినా సరే ఆయన వినకపోవడంతో మిథున్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా మిథున్ రెడ్డి నివాసం వద్దకు చేరుకొని పోలీసులు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి సైతం తనను హౌస్ అరెస్ట్ చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఎంపీగా తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించే అర్హత ఉన్నప్పటికీ .. పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. కాగా, వారం రోజుల క్రితం మిథున్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పుంగనూరు వెళ్లాలని ప్రయత్నించారు. కానీ టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు.
వాస్తవానికి పెద్దిరెడ్డికి పుంగనూరు కంచుకోట. గత 15 ఏళ్లుగా పుంగనూరు రాజకీయాలను ఆయన తన కనుసైగలతో శాసిస్తున్నారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్‌పై దాడులకు దిగడం, ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనకు వస్తే రాళ్ల దాడి చేయడం వంటివి చేసి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి మరోసారి గెలిచినా కూడా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో పుంగనూరులో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఐదేళ్లు పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదని తండ్రీకొడుకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోబ్యాక్ పెద్దిరెడ్డి, గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ తమ నిరసన తెలుపుతున్నారు.