విషప్రచారమే ఊపిరి
అదే జగన్ రాజకీయం
రాజధానిపై మాట, మడమ రెండూ తిప్పారు
ఆయన బృందానిదీ అదే తీరు
అమరావతి ఎంపికకు అసెంబ్లీలో పూర్తి మద్దతు
రాజధాని మార్చబోమని ఎన్నికల ముందు ప్రకటనలు, అధికారంలోకి రాగానే మూడు ముక్కలాటమాటలతో ప్రజలను వంచించడంలో, నిలువునా ముంచడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనతికాలంలో ప్రావీణ్యం సాధించినట్లు కనబడుతోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై అసత్య ప్రచారంతో విషం చిమ్మిన ఆయన.. అధికారంలోకి వచ్చినా.. అబదాఽ్ధలు చెప్పడం మానడం లేదు. రాజధానిగా అమరావతే ఉంటుందని…అందులో మరో మాటే లేదని ఎన్నికల ముందు ఢంకా బజాయించి చెప్పిన ఆయన.. గద్దెనెక్కగానే మాటా.. మడమ రెండూ తిప్పేశారు.
ఆయనతోపాటు వైసీపీ నేతలు కూడా ఇదే మోసపూరిత వ్యూహాన్ని అమలు చేశారు. అమరావతి నుంచి రాజధాని మారబోదని.. ఈ విషయాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టబోతున్నామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ అభ్యర్థులు పదేపదే ఇదే ప్రచారం చేశారు. జనమంతా నమ్మేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను ఏకంగా రాజధాని ప్రాంతం మంగళగిరిలోనే ఓడించారు.
ఇప్పుడు జగన్ మాట మార్చి మూడు రాజధానులని అనడంతో నిర్ఘాంతపోయారు. దీనిని నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు 240 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించుకున్నారు.
గవర్నర్ సంతకాలు కూడా చేశారు. కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికే మూడు రాజఽధానులపై హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ముందు ఏమవుతుంతో తెలియదు గానీ.. అమరావతి చరిత్ర గర్భంలోకి వెళ్లడమైతే ఖాయమైపోయింది.
దాటవేస్తున్న వైసీపీ నేతలు..రాజధానిని మార్చాలన్న ఆలోచన ఉంటే అది ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ఇతర పార్టీల వారు నిలదీస్తుంటే.. వైసీపీ నేతలు బదులివ్వలేక మాట దాటేస్తున్నారు.
రైతులను చంద్రబాబు మోసగించారంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అమరావతి నుంచి రాజధాని మార్పు ఉండబోదని నాడు చెప్పి ఓట్లు వేయించుకున్నందున ఇప్పుడు మరోసారి ప్రజల తీర్పు కోరి ఆ తర్వాత రాజధానిని మార్చాలని చంద్రబాబు విసిరిన సవాల్‌కు కూడా సూటి సమాధానం లేదు.
పైగా ఆయనపై దుమ్మెత్తిపోసి విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా ఆయన్ను చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ప్రజలు నమ్మకపోతుండడంతో మీడియా ముందుకు రావడమే మానుకున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాల్లో.. రాజఽధానిగా అమరావతి ఎంపికపై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పూర్తి మద్దతు ప్రకటించారు. శాసన మండలిలో అన్ని పార్టీలు ఏకగ్రీవ మద్దతు తెలిపాయి.
దానివల్లే తాము పూర్తి నమ్మకంతో భూములు ఇచ్చామని, నాడు మద్దతు ఇచ్చిన పార్టీలు ఇప్పుడు ఎలా మాట మారుస్తాయని అమరావతి ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.
దీనికి కూడా వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. వివిధ సందర్భాల్లో ఆ పార్టీ నేతలు రాజధాని అమరావతిపై చేసిన ప్రకటనలు ఇవీ..వైఎస్ జగన్: (ప్రతిపక్ష నేతగా 2014లో అమరావతి ఎంపికకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ చేసిన ప్రసంగం) ‘విజయవాడలో రాజధానిని పెట్టడాన్ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
దీనికి కారణం ఏమిటంటే మన రాష్ట్రం ఇప్పటికే 13జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం.
మీరు రాజధాని నగరాన్ని ఎక్కడైనా పెట్టండి. కానీ ఎక్కడ పెట్టినా అక్కడ 30 వేల ఎకరాల భూమి ఉన్నచోట పెట్టండి. (మరి ఆయన ఇప్పుడు రాజధానిని మూడు ముక్కలు చేసేశారు.
అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని చట్టాలు తెచ్చారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు ఎవరు పెట్టారు?)ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు: (వైసీపీ ఎన్నికల బేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికల ముందు విలేకరులతో మాట్లాడుతూ).. ‘ఎట్టి పరిస్ధితుల్లోనూ అమరావతిలో ఉన్న రాజధాని అక్కడే ఉంటుంది.
లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు. అమరావతి రాషా్ట్రనికి హెడ్‌క్వార్టర్. అక్కడే ఉంటుంది. అది కొనసాగి తీరుతుంది. కొంత మంది లేనిపోని ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాటిని నమ్మవద్దు.
మేం అమరావతిని మంచి సిటీ స్ధాయికి తీసుకొస్తాం. బాగా అభివృద్ధి చేస్తాం.’వసంత కృష్ణ ప్రసాద్: (మైలవరం వైసీపీ ఎమ్మెల్యే).. ‘మా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అమరావతిని రాజధానిగా గుర్తించి ఇల్లు, క్యాంప్ ఆఫీస్, పార్టీ ఆఫీస్ అన్నీ నిర్మించుకొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాటిని ఆయన కట్టుకొన్నారు. రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్ళదు. అలా వెళ్తే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటాను. వెళ్తే నాది బాధ్యత.
రాజకీయల్లో ఉండను. బొత్స సత్యనారాయణ: (వివిధ సందర్భాల్లో రాజధానిపై చేసిన వ్యాఖ్యలు).. రాషా్ట్రనికి రాజధాని కావాలి. దానికి మేం వ్యతిరేకం కాదు. ఏది శంకుస్ధాపన జరుగుతోందో అదే రాజధాని.
జగన్ వస్తే రాజధానిని మారుస్తారని కొందరు అంటున్నారు. ఎందుకు మారుస్తారు? విభజన చట్టం ప్రకారం కొత్త ప్రభుత్వం వచ్చి విజయవాడ – గుంటూరు మధ్య కొత్త రాజధానిని పెడుతున్నామని చెప్పగానే జగన్ లేచి నిలబడి దానిని సమర్ధించారు.
అంతకంటే ఏం కావాలి?భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రాజధాని మార్పు కోరతారు. మేం కాదు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది. ఉండాలి. కావాలని మాపై నిందలు వేస్తున్నారు.
(అమరావతిని శ్మశానంతో పోల్చి.. రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు)రోజా (తాడేపల్లిలో జగన్ గృహప్రవేశంనాడు): ‘అమరావతిని తరలిస్తారని… రాజధానికి జగన్ వ్యతిరేకమని చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ తన మంత్రులతో మాట్లాడిస్తున్నారు.
ఆయనకు చెంపపెట్టుగా ఈ రోజు ఇక్కడ జగన్ గారి గృహ ప్రవేశం, వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. దీనితో ప్రజలకు కూడా అర్ధమై ఉంటుంది.
కె.పార్థసారథి (ప్రస్తుత పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే.. ఎన్నికల ముందు విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు): ‘రాజధానికి మేం వ్యతిరేకం కాదు. తుళ్లూరులో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలి.
దాని మూలంగా రాష్ట్రం అంతటికీ మేలు జరగాలి. రాజధాని మార్పు ఆలోచన లేదు’ (ఇప్పుడు అమరావతిలో ఆందోళన చేస్తున్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.)