ఆంధ్రావని వాకిట రాజకీయ పరిణామాల మార్పులో భాగంగా చాలా మంది టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. రానున్న కాలంలోనూ ఇదే విధంగా వలసలు షురూ కానున్నాయని తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా కొన్ని మార్పులు జరిగి, వైసీపీకి షాక్ ఇవ్వనున్నాయి. ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన పదవికి గుడ్ బై చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని రాజకీయ ఒత్తిళ్ల మేరకే ఆయన తెలుగుదేశం ను వీడి వైసీపీ వైపు వెళ్లారని తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనిప్పుడు మళ్లీ పూర్వాశ్రమం వైపే మొగ్గుచూపుతున్నారు. టీడీపీ గూటికి చేరుకుని రాజకీయం కొనసాగించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు పార్టీ రీజనల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన లేఖ రాసి మరీ! పార్టీ పదవికి గుడ్ బై చెప్పేశారు. వాసుపల్లి గణేశ్ దారిలోనే ఇంకొందరు విశాఖ నేతలకూ పార్టీకీ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని తెలుస్తోంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలమైన నేతగా పేరున్న బొత్స ఇటు విశాఖలోనూ తన వర్గంను పెంపొందింపజేశారని కూడా తెలుస్తోంది. కానీ సాయిరెడ్డి ఆయన హవాకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. బొత్సకు సాయిరెడ్డికీ ఉన్న విభేదాలు కూడా పార్టీ లో వివిధ నాయకుల మనుగడనే ప్రశ్నార్థకం చేసేశాయి. రీజనల్ కో ఆర్టినేటర్ పదవి తనకే దక్కాల్సి ఉందని కానీ సాయిరెడ్డి కారణంగానే ఆ పదవి రాకుండా పోయిందని బొత్స కొన్ని సార్లు కొన్ని ప్రయివేటు సంభాషణల్లో పేర్కొన్నారు.
సాయిరెడ్డి తరువాత ఇక్కడికి జిల్లాల మార్పు కూర్పు తరువాత వచ్చిన కొత్త రీజనల్ కో ఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఏ స్థాయిలోనూ పరిణామాలను చక్కదిద్దలేకపోతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
అనుకున్న విధంగా ఏవీ కుదరక పోతే ఇక్కడెందుకు అన్న చందంగా మాజీ మంత్రి అవంతి కూడా పార్టీ మారేందుకు చూస్తున్నారన్నది ఓ టాక్. గతంలో ఆయన టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన వారే ! కనుక గంటా సహకారంతో అటుగా వెళ్లే యోచన ఉంది. ఇవేవీ కాకపోతే తన గురువుతో కలిసి జనసేన గూటికి చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇంకా కొందరు ఉత్తరాంధ్ర నేతలు ఇటుగా రావొచ్చు. రాజ్య సభ టికెట్ ఆశించి రాకుండా పోయిన వారు, ఇంకా చాలా మంది పదవుల విషయమై ఆశావహ దృక్పథంతో ఉండి..తరువాత అవి దక్కక నిరాశతో కాలం వెళ్లదీస్తున్న వారు టీడీపీ గూటికి చేరుతారు.