“వైసీపీలోకి మరో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. మేమే వారిని ఆగమని చెబుతున్నాం“-ఇదీ కొన్నాళ్ల కిందట వైసీపీ మంత్రి ఒకరు చేసిన కామెంట్. ఆయన ఏముహూర్తంలో అన్నారో.. కానీ.. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ వైసీపీ వైపు మొగ్గు చూపింది లేదు. వైసీపీలోకి చేరతారనే టాకూ లేదు. మరి ఏం జరిగింది? టీడీపీలో నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకువచ్చిన సంస్కరణలు నచ్చాయా? పార్టీపై సంపూర్ణ నమ్మకం ఏర్పడిందా? ఉంటే సైకిల్‌పైనే ఉంటాం.. అని నిర్ణయించుకున్నారా? అంటే.. కొంత ఇదీ ఉంది.. మరోవైపు అధికార పార్టీలో లుకలుకలు టీడీపీ నేతల గోడ దూకుడు రాజకీయాలకు బ్రేకులు వేస్తున్నాయి.
ఇటీవల టీడీపీలో తీసుకువచ్చిన సంస్కరణలు పార్టీపై నమ్మకం కలిగిస్తున్నాయి. అనేక మంది సీనియ ర్లు, ఎమ్మెల్యేలు.. ఈ మార్పులు, చేర్పులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పార్టీ మారాలని అనుకున్న వారు సైతం.. అంతర్మథనంలో పడ్డారు. దీనికి కారణం.. ఒకటి ప్రజల్లో బాబుపై నమ్మకం పెరుగుతుండడం, మరోవైపు.. వైసీపీ గ్రాఫ్ నేల చూపులు చూస్తుండడం. అదేసమయంలో జగన్‌పై సన్నగిల్లిన విశ్వాసం. ఈ కారణాలు టీడీపీ నుంచి బయటపడాలని భావించిన నేతలకు బ్రేకులు వేయగా.. చంద్రబాబు తీసుకువచ్చిన సంస్కరణలు.. మరింతగా వారిని టీడీపీకే అంకితమయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ పరిస్తితి రాష్ట్ర వ్యాప్తంగా బాగోలేదు. ఎక్కడికక్కడ నాయకులు తన్నుకుంటున్నారు. ఆధిపత్యపోరులో విరామం లేకుండా వ్యవహరిస్తున్నారు.
జూనియర్లు సీనియర్లమీద, సీనియర్లు.. మంత్రులమీద.. మంత్రులు ఎంపీలమీద.. ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్నారు. ఎంత సమన్వయం చేయాలని ప్రయత్నించినా.. సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిలో.. పార్టీలో అనైక్యత రాజ్యమేలుతోంది. దీంతో ఉన్నవారే ఇలా ఉంటే.. కొత్తగా తాము వెళ్లి చేసేదేంటనేది టీడీపీ నేతల ఆలోచన. మరోవైపు.. జగన్ గ్రాఫ్ డౌన్ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న వైఖరిపై మధ్య తరగతి ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మేం కడుతున్న డబ్బులతో అభివృద్ధి చేయడం మానేసి.. ప్రజలకు పందేరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై జగ న్ సమాధానం చెప్పకపోగా.. రోజుకో పందేరపు పథకంతో ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలతో మధ్యతరగతి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక, ఉన్నతస్థాయి, పారిశ్రామిక వర్గాలు కూడా జగన్ సర్కారుపై అసహనంతోనే ఉన్నాయి. దీంతో వైసీపీ గ్రాఫ్ గత ఏడాది ఎన్నికలకు ముందున్న రీతిగా లేదని, తగ్గుతోందనే భావన వ్యక్తమవుతోంది. దీంతో టీడీపీ నేతలు ఎక్కడివారు అక్కడే మౌనంగా ఉండడం గమనార్హం. మొత్తానికి వైసీపీలో ఏర్పడిన ఈ పరిణామాలు.. టీడీపీకి మేలు చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.