వైసీపీలో అందరూ సమానం కాదా? కొందరు కొంచె ఎక్కువ.. మరికొందరు కొంచెం తక్కువా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జరుగుతున్నకీలక చర్చ. దీనికి కారణం.. పార్టీలో అనుసరిస్తున్న విధానాలేనని అంటు న్నారు. మంత్రులుగా ఉన్న వారిలోనూ.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలోనూ ఈ చర్చ జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణల్లో భాగంగా చాలా మందికి జగన్ మంత్రులుగా అవకాశం కల్పించారు. ఇది పైకి కనిపిస్తున్న వాస్తవం.
కానీ, అంతర్గతంగా చూసుకుంటే.. కొందరికి మాత్రమే అది కూడా వ్యక్తిగతంగా ప్రాధాన్యం పెరుగుతుండ డం నేతల మధ్య అసంతృప్తికి దారితీస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. మేరుగ నాగార్జున, తానేటి వనిత, పినిపే విశ్వరూప్ వంటివారు ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు. అయితే.. వారికి స్వేచ్ఛ లేదని.. వారు తీసుకునే నిర్ణయాలను ముందుగా తాడేపల్లికి చెప్పి తీసుకోవల్సి వస్తోందని పార్టీలో చర్చ సాగుతోంది.
అదే సమయంలో బీసీ మంత్రులుగా ఉన్న వారిలోనూ ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారంతా కూడా తాడేపల్లి వద్దకు వెళ్లి ముద్రవేయించుకున్న తర్వాతే.. మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటివారు ఈ వివాదం పడలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో వారు అసలు నిర్ణయాలే తీసుకోవడం మానేశారు. మరోవైపు.. ఇతర సామాజిక వర్గాల్లోనూ ఇదే జరుగుతోంది.
ఇక్కడ కులాలకు ప్రాధాన్యం ఇచ్చి.. వారికి అవకాశం ఇచ్చామని చెప్పుకొంటున్న సీఎం జగన్ కానీ, వైసీపీ కీలక నేతలు కానీ, ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇలా జరుగుతుండడం పై నా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎస్సీ వర్గానికి చెందిన మంత్రి తన సామాజిక వర్గం నిర్వహించిన సమావేశంంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లేవనెత్తిన సమస్యలపై ఆయన మాట్లాడుతూ…. సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అంటే.. ఆయనకు ఎంత స్వేచ్ఛ ఉందో అర్థమవుతోందని అప్పుడే గుసగుస వినిపించింది. ఈ పరిణామాలు పార్టీని బలహీన పరుస్తాయని అంటున్నారు పరిశీలకులు.