ఏపీలో వైసీపీ గతంలో చంద్రబాబుపై సోషల్ ఇంజనీరింగ్ అస్త్రం ప్రయోగించి ఎలా సక్సెస్ అయ్యిందో ? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సైతం అదే అస్త్రం ప్రయోగించనుందా ? అంటే అవునన్న చర్చలే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం తంతు చూస్తుంటూనే ఇది నిజమనిపించేలా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ముందు నుంచి బీజేపీపై పెద్దగా అంచనాలు లేవు. ఆ పార్టీ ఆఫ్ట్రాల్ పార్టీ అని.. నోటాతో పోటీ పడాల్సిందే అన్న సెటైర్లు రాజకీయ పక్షాల నుంచే వచ్చాయి. వైసీపీ అయితే అస్సలు పట్టించుకోలేదు.
బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు జనసేన మద్దతు ఇచ్చినా కూడా జనసేన కార్యకర్తలు కూడా బీజేపీకి ఓట్లేసేందుకు ఎంత మాత్రం సుముఖంగా లేవన్నదే ఇప్పటి వరకు వినిపించిన మాటలు. వైసీపీ అతి ధీమాతో ఉండడానికి కూడా ఇదే ప్రధాన కారణం.
పవన్ కళ్యాణ్ మాకు పోటీయే కాదు.. అసలు పవన్ మేం పట్టించుకోం.. పవన్ మద్దతు ఉన్నా మమ్మలను ఎవ్వరూ ఏం చేయలేరు… మా పోటీ తెలుగుదేశంతోనే అన్న వైసీపీ ఇప్పుడు కాస్త టర్న్ అయినట్టే కనిపిస్తోంది. పవన్ నేరుగా వచ్చి ప్రచారం చేయడం, దానికి మంచి స్పందన రావడం, బీజేపీ పెద్దగా దృష్టిపెట్టడంతో ఓట్లు చీలిపోతాయేమో అన్న భయం వైసీపీలో పెరిగింది.
అందుకే వైసీపీ కూడా ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మినో లేదా టీడీపీ అధినేత చంద్రబాబునో ప్రధానంగా విమర్శించడం లేదు. మెయిన్‌గా బీజేపీ ఏపీకి ఎంత అన్యాయం చేసిందో దానినే వైసీపీ వాళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ వాళ్లు కూడా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తుండడం ప్రధానంగా కనిపిస్తోంది.
ఈ విమర్శల్లోనూ సోషల్ ఇంజనీరింగ్‌ను పాటిస్తోన్నట్టే ఉన్నారు. పవన్ అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని మంత్రి పేర్ని నాని లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్ సైతం పవన్‌ను విమర్శిస్తున్నారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా బీజేపీకి ఓ ఊపు అయితే ఇక్కడ వచ్చిందన్నది నిజం. వైసీపీ ఇప్పుడు గత ఎన్నికలకు ముందు చంద్రబాబును సామాజిక కోణంలో ఎలా టార్గెట్‌గా చేసి వీక్ చేసిందో ఇప్పుడు పవన్‌ను కూడా అదే కోణంలో టార్గెట్ చేస్తోందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అందుకే పవన్ సామాజిక వర్గానికే చెందిన మంత్రి పేర్ని నానితో పవన్‌ను టార్గెట్ చేయించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో బలజ వర్గం ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తిలో వీళ్ల ఓట్లు లేకపోతే ఏ అభ్యర్థి కూడా గెలవడు. ఓవరాల్‌గా పార్లమెంటు పరిధిలో ఓసీల్లో రెడ్ల తర్వాత బలిజ ఓటర్లే ఎక్కువ.
ఇప్పుడు పవన్ ద్వారా ఈ ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ వేస్తోన్న ఎత్తులకు వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తూ పవన్‌ను టార్గెట్ చేయిస్తూ పై ఎత్తు వేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎవరికి అనుకూలంగా ఫలిస్తాయి అన్నది చూడాలి.
అయితే, బీజేపీ కూటమి కనుక గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అవి కచ్చితంగా వైసీపీ నుంచే చీలుతాయి అన్నది విశ్లేషకుల అంచనా. మరి చూద్దాం ఏం జరుగుతుందో.