తన అన్న జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని వైఎస్ సునీతా చాలాకాలంగా ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసును ఏదైనా పొరుగు రాష్ట్రంలోని హైకోర్టుకు బదిలీ చేయాలన్న సునీత అభ్యర్థనకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, జగన్ కు షాక్ తగిలినట్లయింది. ఇక, ఆ షాక్ నుంచి జగన్ తేరుకోక ముందే…సొంత సోదరి వైఎస్ షర్మిల…జగన్ కు మరో షాక్ ఇచ్చారు.
వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదేనంటూ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్లు ఇరు తెలుగు రాష్ట్రాలలో కాక రేపుతున్నాయి. కేసు బదిలీ మంచి పరిణామమని, తమ కుటుంబంలో చిన్నాన్న వివేకా హత్య ఓ ఘోరమైన ఘటనగా మిగిలిపోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సునీతా రెడ్డికి న్యాయం జరగాల్సిందేనని, వివేకాను ఘోరంగా హతమార్చినవారెవరో బయటకు రావాల్సిందేనని అన్నారు.
వివేకా మర్డర్ కేసు దర్యాప్తును ఎవరూ అడ్డుకోకూడదని, ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్ల సంగతి సీబీఐ దర్యాప్తులో తేలుతుందని అన్నారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్ష పడాలని, విచారణ జరగాలని అన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. హస్తినలో కాగ్ అధికారులను కలిసిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతిపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
దివంగత సీఎం వైఎస్ ఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లు కేటాయించి పూర్తి చేయాలనుకున్నారని, 16 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించారని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ వ్యయం లక్షా 20 వేల కోట్లకు పెంచారని, ఆయకట్టు 2 లక్షల ఎకరాలు మాత్రమే పెరిగిందని ఆరోపించారు.