సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తగ్గేదేలే అన్న రీతిలో అన్నపై చెల్లి షర్మిల విమర్శనాస్త్రాలు సంధించడం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్సార్ సిపిపై షర్మిల మరోసారి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ లేరని షర్మిల చురకలంటించారు. వైఎస్ఆర్ సీపీలో వైఎస్సార్ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి సజ్జల అంటూ కొత్త నిర్వచనం చెప్పారు షర్మిల. వైసీపీ అంటే జగన్ పార్టీ అని సెటైర్లు వేశారు.
తన కుటుంబాన్ని, పిల్లలను వదులుకొని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తనపై ఇప్పుడు వైసీపీ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారని షర్మిల వాపోయారు. అయినా సరే, ఆ విమర్శలకు తాను భయపడేది లేదని, అన్నిటికి సిద్ధపడే వచ్చానని షర్మిల చెప్పారు. గతంలో వైసీపీని తన భుజాలపై మోశానని, పార్టీ కోసం తన రక్తం ధారపోశారని షర్మిల అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయిన షర్మిల వైసీపీ పాలనలో ఒంగోలుకు ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఆ హామీ అమలు చేయకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలలోకానికి ఉన్నంత తేడా ఉందని సంచలన విమర్శలు గుప్పించారు. వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును 600 కోట్లకు అమ్మేశారని తాను చేసిన ఆరోపణకు సజ్జల సమాధానం హాస్యాస్పదంగా ఉందని షర్మిల అన్నారు. ఆ 600 కోట్లతో ఇతర పోర్టులను అభివృద్ధి చేశామని సజ్జల చెబుతున్నారని, ఆ 600 కోట్లను సృష్టించలేకపోయారా అని చురకలంటించారు. 9 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏమైపోయిందని ప్రశ్నించారు.
ఇక, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై కూడా షర్మిల పరోక్షంగా సెటైర్లు వేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పట్టించుకోవాల్సిన సంబంధిత శాఖా మంత్రి సంక్రాంతి డాన్సులు చేస్తారే తప్ప పనిచేయరట అంటూ అంబటి రాంబాబుకు పరోక్షంగా చురకలంటించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు మెయింటెనెన్స్ ను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆమె ఆరోపించారు. వైఎస్సార్ 750 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మిస్తే …మెయింటనెన్స్ కోసం ఏడాదికి కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు. 10 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు నిలబడుతుందని లేదంటే వృధా అవుతుందని వాపోయారు. ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతుండడం చూసి వైసీపీ నేతలు అవమానంతో తలదించుకోవాలని అన్నారు.