ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ దిన పత్రిక ప్రస్తావించగా….షర్మిల ఆ పత్రిక కథనాన్ని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ అభిమానులు, కొంతమంది రాజకీయ నేతలు, నల్గొండ జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే త్వరలోనే తెలంగాణలో రాజన్య రాజ్యం రాబోతోందంటూ షర్మిల సంచలన ప్రకటన చేశారు. గ్రామాల్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించానని చెప్పిన షర్మిల… పార్టీ పెడితే అభిమానులకు చెప్పే పెడతానని అన్నారు. తాను ఎందుకు పార్టీ పెట్టకూడదంటూ మీడియాను ప్రశ్నించిన షర్మిల…తాను పార్టీ పెట్టబోతున్నానని పరోక్షంగా ప్రకటించారు. తెలంగాణలో రాజన్న లేని లోటు ఉందని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని షర్మిల అన్నారు.
అయితే, ఈ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని షర్మిల తెలిపారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పని చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని చెప్పారు. తెలంగాణ వైసీపీ విభాగంతో కలసి పని చేస్తారా అని అడిగిన విలేకరులు అడిగిన ప్రశ్నకు…ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పారు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కొనసాగుతుందని చెప్పిన షర్మిల రాజకీయంగా తన దారి తనదేనని అన్నారు.
తెలంగాణకే తాను పూర్తిగా పరిమితమై, అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. అయితే, పార్టీ పెట్టబోతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల సమాధానం దాటవేశారు. తాను ప్రస్తుతం అన్ని జిల్లాల నేతలతో మాట్లాడుతున్నానని, అందరూ కాస్త ఓపిక పట్టాలని… అన్ని విషయాలు త్వరలో చెబుతానని అన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తెలంగాణలో పాదయాత్ర చేసే అవకాశముందా అన్న ప్రశ్నకు..చేస్తానేమో అని బదులిచ్చారు.
ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని, ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదవాలని, పేదరికం రూపుమాపాలని నాన్నగారు శ్రమించారని అన్నారు. తెలంగాణలో ఆరేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందని, ఆరోగ్యశ్రీ సరిగా అమలు కావడం లేదని షర్మిల ప్రశ్నించారు. మొత్తానికి షర్మిల వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికి…త్వరలోనే ఆమె కొత్త పార్టీ పెట్టడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.