జాతీయ రాజకీయాల్లోకి జగన్?...అందుకే షర్మిల పార్టీ?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే క్రమంలోనే ఈ రోజు లోటస్ పాండ్ లో కార్యకర్తలు, నేతలతో ఆమె సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. షర్మిల కొత్త పార్టీ పెట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఏపీలో సీఎం జగన్ ఆయన పని చూసుకుంటారని, తెలంగాణలో తాను తన పని చూసుకుంటానని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏపీ రాజకీయాలు జగన్ చూసుకుంటారని, తెలంగాణలో రాజకీయాలు తాను చూసుకుంటానని చెప్పారు. ఈ క్రమంలోనే షర్మిల ప్రకటనపై వై‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం అని సజ్జల అన్నారు. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగిందని, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాజకీయాలపై జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని సజ్జల చెప్పారు. గత 3 నెలలుగా తెలంగాణలో వైసీపీ ఎందుకు ఉండకూడదన్న చర్చ జరుగుతోందని, అయితే, తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారని తెలపారు. తెలంగాణలోకి వెళ్లాలన్న ఆలోచన వైసీపీకి లేదని, తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల సొంత ఆలోచనగా కనిపిస్తోందని అన్నారు. జగన్, షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు లేవని సజ్జల అన్నారు.

షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతమని, షర్మిల పాదయాత్ర చేసి, పార్టీ పెట్టాలన్న యోచనలో ఉన్నట్టు కనిపిస్తోందని చెప్పారు. తండ్రి స్పూర్తితో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఏపీకే జవాబుదారీ అని చెప్పారు. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారని, ఏపీకే కట్టుబడి ఉండాలన్నది సీఎం జగన్‌ నిశ్చితాభిప్రాయం అని సజ్జల స్పష్టం చేశారు.


షర్మిళ కొత్త పార్టీ పెట్టవద్దని చెప్పడానికి చాలా ప్రయత్నించామని, పార్టీ పెడితే వచ్చే కష్టనష్టాలు కూడా వివరించామని చెప్పారు. రాజకీయంగా షర్మిల అనుభవజ్ఞురాలని, కొత్త పార్టీ నిర్ణయానికి ఆమెదే బాధ్యత అని షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీ రాజకీయాల్లో షర్మిలను ఎదగనీయలేదనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆమెకు సహకరించడం వల్లే పాదయాత్ర చేశారని అన్నారు. దేశంలో తమది నాలుగో అతిపెద్ద పార్టీ అని, జగన్ కు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అవకాశముందని చెప్పారు.


జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశముందన్న సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ కు తెలిసే షర్మిల పార్టీ పెడుతున్నారన్న సంగతి ఇట్టే అర్థమవుతుంది. జగన్ కు తెలీకుండా షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారం నమ్మిన వారు నిజంగా వెర్రి వెంగళప్పలేనన్న భావన కలుగక మానదు. అయితే, ఇంకా రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా అవగతం చేసుకోని జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచన ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. ఏపీని విజయమ్మకు అప్పజెప్పేసి...తెలంగాణలను షర్మిలకు అప్పజెబితే...జగన్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చన్నది జగన్ యోచన కాబోలు. అసలు షర్మిల పార్టీ ఎంతవరకు వర్కవుటవుతుందో కాలమే సమాధానమివ్వాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.