టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల భేటీ కావడం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. తన కుమారుడి పెళ్లికి చంద్రబాబు దంపతులను ఆహ్వానించేందుకు షర్మిల వచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను చంద్రబాబును కలవడంలో వింత, విచిత్రం ఏమీ లేదని షర్మిల అన్నారు. రాజారెడ్డి పెళ్లికి పలువురు రాజకీయ నేతలను ఆహ్వానిస్తున్నానని, ఆ క్రమంలోనే చంద్రబాబు కుటుంబాన్ని కూడా ఆహ్వానించానని షర్మిల అన్నారు. గతంలో తన పెళ్లికి చంద్రబాబును తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆహ్వానించారని, ఆయన తన పెళ్లికి హాజరై ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు.
తన కుమారుడి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారని అన్నారు. రాజశేఖరరెడ్డితో అనుబంధం గురించి తనతో చంద్రబాబు ప్రస్తావించారని, తమ ఇద్దరి స్నేహం, రాజకీయ ప్రయాణం గురించి చర్చించామని చెప్పారు. సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడలేదని, తమది స్నేహపూర్వక భేటీ అని చెప్పారు.
లోకేష్ తన గురించి చేసిన ట్వీట్ ను రాజకీయంగా చూడవద్దని, చంద్రబాబుతోపాటు కేటీఆర్, కవితలకు కూడా క్రిస్మస్ కేక్ మాత్రమే పంపానని చెప్పారు. రాజకీయమే జీవితం కాదని, ప్రత్యర్థులుగా ఒక మాట అనుకున్నా..వ్యక్తిగత సంబంధాలు నెరపి అనుబంధం పెంపొందిచుకోవాలని చెప్పారు.