వినుకొండ రషీద్ హత్య కేసును అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుదైదు రోజుల నుంచి ఎంతలా హంగామా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా జులై 24న ఢిల్లీలో వైసీపీ ధర్నా చేస్తుందని ఇప్పటికే జగన్ ప్రకటించారు. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ మరియు వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభలో నుంచి వాకౌట్ చేశారు.
ఇక ఇదే తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్ తీరుపట్ల మండిపడ్డారు. సోమవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. తన అన్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు చేశారు. హ్యత చేయించిన వారితోనే తిరుగుతూ సొంత చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ కార్యకర్త ను చంపినందుకు ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్నారు.. మరి సొంత చిన్నాన్నను చంపినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? న్యాయం కోసం ఎందుకు పోరాడలేదు? అని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న మీరు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు ధర్నా చేశారు? పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎన్నిసార్లు పట్టించుకున్నారు? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.
భారీ వర్షాల వల్ల ప్రజలు అంతలాకుతలం అయ్యారు.. వారిని పరామర్శించాలని మీకు అనిపించలేదా? అని జగన్ పై ఫైర్ అయ్యారు. శాసనసభా సమావేశాల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని షర్మిల విమర్శించారు. వినుకొండలో జరిగింది.. రాజకీయ హత్యకానే కాదు వ్యక్తిగత కక్షలతో జరిగిన మర్డర్.. హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఇద్దరూ మొన్నటివరకు వైసీపీతోనే ఉన్నారని షర్మిల అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని.. వరదల్లో నష్టపోయిన రైతులకు అండంగా నిలవాలని సూచన చేశారు.