అవును..ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. షర్మిల నియామకం లాంఛన ప్రాయమే అని చాలారోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ కాంగ్రెస్ అధిష్టానం తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
రెండు రోజుల క్రితం తన పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతోనే షర్మిలకు రూటూ క్లియర్ అయింది. మరి, షర్మిల రాకతో ఏపీలో టైటానిక్ లా ముగినిపోతున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పైకి వస్తుందా అన్న సంగతి ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి వచ్చినట్లే ఏపీలో కూడా రావాలన్ని ఉద్దేశ్యంతో వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో టికెట్ దక్కని ఒక సామాజిక వర్గం నేతలు చేజారకుండా కాంగ్రెస్ లో చేర్చడమే షర్మిల టాస్క్ అని తెలుస్తోంది.