ఏపీలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండవాలు ధరించి, ప్లే కార్డ్స్ పట్టుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై నిరసన తెలిపేందుకు వచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. అసెంబ్లీ ఎదుట జగన్ వీరాంగం సృష్టించారు.
వైఎస్ జగన్ సహా మిగిలిన సభ్యులందరినీ పోలీసులు ఆపడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. `మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో..` అంటూ తనను అడ్డుకున్న పోలీసు అధికారిని ఉద్దేశించి జగన్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.
`రోజులు ఇలాగే ఉండవు.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా?. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యుట్ కొట్టడం మాత్రమే కాదు..ప్లకార్డ్స్, నల్ల కండవాలు తొలగించాలని పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు` అంటూ జగన్ ప్రశ్నించారు.
ఇకపోతే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ సమయంలో కూడా వైసీపీ సభ్యులు రెచ్చిపోయారు. సేవ్ డెమొక్రసీ, హత్యా రాజకీయాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. అయినా సరే గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపకుండా పూర్తి చేశారు. అయితే గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే జగన్ మరియు వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడం గమానర్హం. మరోవైపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానున్నందున, మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కొత్త ప్రభుత్వం ఉంది.