కొంతమంది నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ.. పేరుప్రఖ్యాతులు వారికి పెద్దగా ఉండకపోవటంతో మీడియాలో వారి మాటలకు ప్రాధాన్యత లభించదు. తాజాగా అలాంటి పరిస్థితే కనిపించింది.
ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలువురు నేతలు పలు రకాలుగా విమర్శలు చేసి ఉండొచ్చు.. పంచ్ లు వేసి ఉండొచ్చు. కానీ.. టీడీపీకి చెందిన నెల్లూరు నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. ఈ తరహా వ్యాఖ్యను ఏ రాష్ట్ర స్థాయి నేత నోటి నుంచి రాకపోవటం గమనార్హం.
ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అన్న విషయాన్ని చూస్తే.. నెల్లూరు నగర టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి. తాజాగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక చెల్లికి పిత్రశోకాన్ని మిగిల్చారని.. మరో చెల్లికి నమ్మక ద్రోహం చేశారన్నారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని పట్టుకోలేక.. ఒక చెల్లికి తండ్రి లేని లోటును మిగిల్చారని చెప్పారు.
అదే సమయంలో మరో చెల్లిని అవసరానికి వాడుకొని ఇప్పుడు నమ్మించి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో వస్తువుల ధరలుపెంచి కోట్లాదిమంది అక్కాచెల్లెమ్మలకు వంటింటి శోకాన్ని మిగిల్చారంటూ మండిపడ్డారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఇద్దరు చెల్లెమ్మలకు బాధను.. వేదనను మిగిల్చారన్న కీలకమైన పాయింట్.. రాష్ట్ర స్థాయి నేతలకు కాకుండా.. ఒక స్థానిక తెలుగు తమ్ముడికి రావటం గమనార్హం.