నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం.. అదేమంటే.. అదే రాజకీయం అంటూ చెప్పే మాటలు చూస్తున్న వేళ.. బుర్ర లేని వారి మాటలకు స్పందించాల్సిన అవసరం ఏముందంటూ కొందరు మౌనంగా ఉండటం.. చాలామంది అల్పులకు ఒక అవకాశంగా మారుతోంది. తాము కోరుకున్నట్లుగా రాజకీయ నిర్ణయాలు తీసుకోని ప్రత్యర్థులకు ఏదో రంగు అంటించేసి వినోదాన్ని చూసే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో మొదట్నించి అలాంటి కుట్ర ఒకటి భారీగా సాగుతోంది.
మిగిలిన రాజకీయ అధినేతల మాదిరి.. పవన్ కు ఎవరూ అండగా ఉన్నది లేదు. ఆయనకు ఆయనే సొంతంగా తన దారి తాను ఏర్పర్చుకొని నడుస్తుంటారు. ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలపై అదే పనిగా మాట్లాడే చాలామంది మేధావులు.. కాస్త వెనక్కి వెళ్లి తోపు రాజకీయ అధినేతలుగా కీర్తించే కొందరు తీసుకున్న నిర్ణయాల గురించి ఎందుకు విశ్లేషించరు? పవన్ ఏం చేసినా తప్పే అని చెబుతూ.. ఆయన నిర్ణయాలపై లోతైన విశ్లేషణలు చేసే వారు.. తాము వీరగా అభిమానించే అధినేతల నిర్ణయాలను అదే ‘కోణం’లో ఎందుకు విశ్లేషించరు? అన్నది ప్రశ్న.
టీడీపీతో ఎన్నికల పొత్తు ఉంటుందని జనసేన అధినేత హోదాలో పవన్ తన నిర్ణయాన్ని రాజమహేంద్రవరం జైలు బయట వెల్లడించిన వెంటనే.. జనసేనానిని టార్గెట్ చేస్తూ మొదలు పెట్టిన ప్రచారాలను చూసినప్పుడు నవ్వు రాక మానదు. తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని.. రాబోయే ఎన్నికల్లో తాము మిత్రులమన్న విషయాన్ని విస్పష్టంగా చెప్పేసిన వైనంపై ఎందుకంత ఉలికిపాటు? అంటే.. తాము నిలుచున్న భూమి కంపించటమే కారణమని మాత్రం చెప్పక తప్పదు.
ఒకవేళ అలాంటిదేమీ లేదు.. పవన్ కు అంత సీన్ లేదనుకుంటే.. ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని అంతలా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పవన్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు నచ్చకుంటే నష్టపోయేది పవన్ కల్యాణే తప్పించి ఇంకెవరు కాదు కదా? అలాంటప్పుడు ఆయనకు లేని ఇబ్బంది మిగిలిన రాజకీయ పార్టీలకు ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తక మానదు.
చంద్రబాబు నాయుడి పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తుకు ఓకే అన్నంతనే.. ఇంతకంటే దిక్కుమాలిన నిర్ణయం ఉందా? ఇదెక్కడి పొత్తు అంటూ వీరావేశంతో వీరంగం వేసే వారంతా.. తోపు సమైక్యవాదిగా ఘనంగా కీర్తించే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన రాజకీయ నిర్ణయాల్ని మర్చిపోతున్నారని చెప్పాలి.
2004 ఎన్నికల్లో విభజనవాదిగా ముద్రపడి.. తన సత్తా చాటేందుకు పోరాడుతున్న కేసీఆర్ తో వైఎస్ దోస్తీ ఎలా చేయగలిగారు? ఏపీని ముక్కలు చేయకూడదన్నదే వైఎస్ లక్ష్యమైతే.. విభజన వాదనల్ని వినిపించే కేసీఆర్ పార్టీతో కాంగ్రెస్ చేతులు కలిపేలా ఎందుకు చేయగలిగారు? తాను కోరుకున్నంతనే ముఖ్యమంత్రి అయ్యారని కీర్తించే ఇప్పటి అధికారపక్ష నేతలు తమ అధినేతను గొప్పగా పొగిడేస్తారు.
మరి.. వైఎస్ ముఖ్యమంత్రి కావటానికి దశాబ్దాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? సీఎం పదవి కోసం అన్ని దఫాలు ప్రయత్నించారంటే.. వైఎస్ కు రాజకీయం తెలీదా? అన్న ప్రశ్న వేస్తే ఎంత పూలీష్ గా ఉంటుందో పవన్ విషయంలోనూ అదే పనిగా టార్గెట్ చేస్తూ.. నోటికి వచ్చినట్లుగా విమర్శిస్తే అంతేలా ఉంటుందన్న వాస్తవాన్ని ఆయన ప్రత్యర్థులు ఎప్పటికి గుర్తిస్తారో?