తెలుగు రాజకీయాలు అంతకంతకూ దరిద్రాతి దరిద్రం గా మారిపోతున్న వైనం గడిచిన కొంతకాలంగా చూస్తున్నాం. సైద్ధాంతిక విభేదాల నడుమ రాజకీయాలు నడిపే స్థితి నుంచి.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు వ్యక్తిగత వైరానికి మించిన తీరులో రాజకీయాల్ని తీసుకొచ్చిన ఘనత తెలుగు రాజకీయ నేతలకే దక్కుతుంది. ఇప్పటికి ఉన్న దరిద్రాలు సరిపోనట్లుగా.. ఇప్పుడు మరో కొత్త దరిద్రాన్ని తెలుగు రాజకీయాలకు పరిచయం చేశాడు మన్విత్ క్రిష్ణారెడ్డి. ఇతడేమైనా ప్రముఖ నేతనా? ఇంతలా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది? అని అడగొచ్చు.
ఇతడు ప్రముఖుడు కాదు కానీ.. ఇతను షురూ చేసిన విధానం ప్రమాదకరమైనదే కాదు.. మన కళ్లు మనల్ని మోసం చేసే కొత్త ఎత్తుగడను తెలుగు ప్రజలకు పరిచయం చేశాడు. ఆర్ ఎంకేఆర్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఇతడు.. ఏపీ అధికార పార్టీకి సానుభూతిపరుడిగా వ్యవహరిస్తుంటాడు. ఆ పార్టీకి విధేయుడైన కార్యకర్త కమ్ ఛోటానేతగా అతనికి పేరుందని చెబుతారు.
అలాంటి వ్యక్తి.. తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అతను తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తగా వేషం కట్టి.. తన వెనుకున్న స్క్రీన్ లో టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్ సింబల్ ముందు కూర్చొని వీడియో చేశాడు. తన పేరుకు సైతం వేరే సామాజిక వర్గానికి చెందిన తోకను తన పేరుకు కలిపి పెట్టుకోవటం.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేలా చేయటమేకాదు.. కొన్ని వర్గాల్ని టార్గెట్ చేసినట్లుగా దారుణ రీతిలో మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
చూసినంతనే టీడీపీకి చెందిన వ్యక్తిగా కనిపిస్తూ.. కొన్ని సామాజిక వర్గాల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేయటం.. ఆ వర్గాల వారు పార్టీని అసహ్యించుకునేలా మాట్లాడటం చూసినప్పుడు.. ఈ తరహా వీడియోల ఆలోచన వణుకు పుట్టేలా ఉంది. సొంత పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటం ఈ వీడియో ప్రత్యేకత.
ఇలాంటి తీరుతో జరిగే నష్టం ఏమంటే.. మాట్లాడే వ్యక్తికి.. అతను మాట్లాడే మాటలకుఏ మాత్రం పొంతన లేకపోవటమే కాదు.. ఎవరిని నమ్మాలో..నమ్మకూడదో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కనిపిస్తూ.. మరో పార్టీకి మేలు జరిగేలా వ్యవహరించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి ధోరణి ఏమాత్రం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. తాముఅభిమానించే పార్టీకి మేలు చేయాలన్న తపనను అర్థం చేసుకోవచ్చు. కానీ.. అందుకు తప్పుడు మార్గాల్ని ఎంచుకుంటే సదరు నేత ఇమేజ్ మాత్రమే కాదు.. అతగాడు ఫాలో అయ్యే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
ఇలాంటి తీరుతో కలిగే మరో నష్టం ఏమంటే.. నువ్వు రెండు చేస్తే నేను నాలుగు చేస్తా. నువ్వు నాలుగు చేస్తే ఎనిమిది చేస్తానంటూ చెలరేగిపోయి చేసే చేష్టల కారణంగా మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనికి తోడు అవసరంలేని ఉద్రిక్తతలకు తెర తీసినట్లు అవుతుంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ రాజకీయాలు వ్యక్తిగత స్థాయికి దిగజారి పోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
దీనికి తోడు.. ఇటీవల కాలంలో రాజకీయాలు ప్రతీకారేచ్చ పెరిగిపోవటమే కాదు.. బహిరంగంగా సవాళ్లు విసురుతున్న వైనం ఏపీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా మారింది. ఇదే తరహా పరిస్థితులు నెమ్మదిగా తెలంగాణలోనూ ఎంట్రీ ఇవ్వటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. రాజకీయాలన్న తర్వాత దూకుడు కామన్. కానీ.. అది హద్దుల్లో ఉండాలి. అంతకుమించి అన్నట్లుగా ముందుకెళితే.. ప్రతి పార్టీకి కష్టమే. ఎందుకంటే.. ఒక దరిద్రపుగొట్టు పద్దతి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విషయం అక్కడితో ఆగదు. ఈ విషయంలో పార్టీలు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే.. అందుకు తగ్గ మూల్యాన్ని తర్వాతి రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.