షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ఫాలో అయ్యేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. కమెడియన్ హర్షకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన ‘వైవా’లో ఓ చిన్న పాత్రతో పరిచయం అయి.. ఆ తర్వాత లీడ్ రోల్స్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి పాపులారిటీనే సంపాదించాడీ కుర్రాడు. అతడి యూట్యూబ్ ఛానెల్‌కు ఏకంగా 28 లక్షల మందికి పైగా ఫాలోవర్లుండటం గమనార్హం. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ అనే అతడి కొత్త షార్ట్ ఫిలిమ్ గొప్ప ఆదరణే సంపాదించుకుంది. దానికి 1.8 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అదెంతగా ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పాపులారిటీ బుల్లితెరలోనూ ప్రోగ్రాంలు పాల్గొంటూ ఇంకా ఫాలోయింగ్ పెంచుకుంటున్న షణ్ముఖ్.. ఇప్పుడో చెడ్డ పనితో వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అతను మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో షణ్ముఖ్ నడుపుతున్న కారు కలకలం రేపింది. అది రెండు కార్లతో పాటు ఓ బైక్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఉదంతంలో కొందరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో షణ్ముఖ్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బ్రీత్ అనలైజర్ పెడితే 170 పాయింట్లు చూపించిందట. 30 పాయింట్లు దాటితేనే పోలీసులు కేసు బుక్ చేస్తారు. షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతను పోలీస్ స్టేషన్లో బేరాలాడుతున్న దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. ఎవరికీ ఏం కాలేదు కదా, ఆసుపత్రిలో చేరలేదు కదా.. మరెందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం అంటూ అతను అడుగుతున్న వైనం అందులో కనిపిస్తోంది. మామూలుగా షణ్ముఖ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్‌కు భారీగా వ్యూస్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు అతను అరెస్టయిన, స్టేషన్లో బేరాలాడుతున్న వీడియోలు వైరల్ అవుతూ భారీగా వ్యూస్ తెచ్చుకునే పరిస్థితి రావడం గమనార్హం.