విశాఖలోని రుషికొండపై తవ్వి అక్కడ సెక్రటేరియట్ కడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయని, వాటిని పడగొట్టి పునర్నిర్మిస్తున్నామని చెబుతున్నారు. అయితే, తాజాగా పవన్ టూర్ నేపథ్యంలో పొరపాటున వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై అసలు నిజం బట్టబయలైంది. విశాఖను దోచుకుంది టీడీపీనే అని అయ్యన్న పాత్రుడు అన్నారని, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో వచ్చిన ఒక ట్వీట్ వైరల్ అయింది.
రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంటే పవన్, చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని ఆ ట్విటర్ ఖాతాలో ట్వీట్ వచ్చింది. దీంతో, ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన వైసీపీ నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. దీంతో, వెంటనే వైసీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తూఛ్ నిన్న చేసిన ట్వీట్లో పొరపాటున అక్కడ సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నామని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా పరిగణలోకి తీసుకోగలరని ఈ రోజు సవరణ ట్వీట్ చేసింది. అయితే, ఫ్లోలో నిజం చెప్పిన వైసీపీ…ఇపుడు డ్యామేజీ కంట్రోల్ చేసుకునేందుకు సవరణ ట్వీట్ చేసిందని టీడీపీ సోషల్ మీడియా ఏకిపారేస్తోంది.
దీంతో, టూరిజం శాఖా మంత్రి రోజా రంగంలోకి దిగారు. ఆ ట్వీట్ ను మరచిపోవాలని, దానిని పట్టుకొని వేలాడొద్దని హితవు పలికారా అమాత్యులవారు. ఆ ట్వీట్ ను ప్రచురించిన ఈనాడు పత్రికపై కూడా రోజా మండిపడ్డారు. ఆ ట్వీట్, పవన్ పనికిమాలిన మాటలు ప్రచురించిన ఈనాడు…మంత్రి హోదాలో తాను చెప్పిన విషయాలు మాత్రం ప్రచురించలేదని మండిపడ్డారు. అక్కడ హరిత రిసార్ట్స్ రెనోవేట్ కార్యక్రమం మాత్రమే జరుగుతోందని, కోర్టు, ఎన్ జీటీ అనమతులున్నాయని చెప్పారు. కోర్టుల కన్నా పవన్ గొప్పవాడు కాదని, త్వరలోనే పవన్ మెంటల్ హాస్పటల్ కు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.