మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. అలా.. ఏపీలో సీఎంగా, వైసీపీ అధినేతగా జగన్ ఎంత బలవంతుడైనా ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం తమ ధోరణి తమదే అన్నట్లుగా ఉంటున్నారు. జగన్ ఎన్నిసార్లు హెచ్చిరించినా కూడా, మీ సీటుకు ఎసరొస్తాదని వార్నింగులు ఇస్తున్నా కూడా జనంలోకి వెళ్లడం లేదట. దీంతో ఇంటెలిజెన్స్, ఐ ప్యాక్ సర్వేల రిపోర్టులు పట్టుకుని జగన్ వారికి నేరుగా క్లాస్ పీకినా కూడా వారు ఏమాత్రం చలించనట్లు సమాచారం.
గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యలంతా విధిగా పాల్గొనాలని జగన్ పదేపదే చెప్తున్నా కూడా ఇంకా 18 మంది ఎమ్మెల్యేలు ఒక్క గడప కూడా తొక్కలేదన్నది ఐప్యాక్ రిపోర్ట్. దాని ప్రకారం జగన్ వారిని హెచ్చరించారు. ఆ పేర్లు పార్టీ వైపు నుంచి బయటకు రాకపోయినా ఐప్యాక్ నుంచి లీక్ కావడంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. బొత్స, పెద్దిరెడ్డి వంటి మంత్రులు.. స్పీకర్ తమ్మినేని సీతారాం సహా వసంత కృష్ణప్రసాద్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి, గ్రంధి శ్రీనివాస్, కోలగట్ల వీరభద్ర స్వామి వంటి ఎమ్మెల్యేల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి.
అయితే.. ఇప్పటికైనా మారకపోతే టికెట్లు రావని జగన్ ఇండైరెక్టుగా హెచ్చరించగా జగన్ ఆత్మ సజ్జల మాత్రం వీరిలో కొందరిని డైరెక్టుగా హెచ్చరించారట. మీ గ్రాఫ్ పడిపోతోంది.. వచ్చే ఎన్నికలలో మీకు టికెట్ రావడం కష్టం అంటూ వారికి సంకేతాలు ఇస్తుండడంతో వారి నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. సెంట్రల్ ఆంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇలాంటి హెచ్చిరికలే చేస్తే వారు.. ‘జగన్ గ్రాఫ్ ఆల్రెడీ పడిపోయింది.. మా గ్రాఫ్ సంగతి పక్కన పెట్టి ఆయన గ్రాఫ్ సరిచేసుకోండి’ అంటూ ముఖంమీదే చెప్పినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి.
ఇక మంత్రులలో కూడా కొందరు ఇంత ఓపెన్‌గా సజ్జలకు కౌంటర్ వేయకపోయినా జగన్ గ్రాఫ్ పడిపోయిందని.. తమ విషయం ఎక్కువగా ఆలోచించవద్దని ఇండైరెక్టుగా చెప్పినట్లు వినిపిస్తోంది.