ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక న్యాయ బస్సు యాత్ర తొలి దశపై అంచనా లు తల్లకిందులు అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెక్ పెడుతూ.. ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కౌంటర్‌గా వైసీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే గత నెలలో తొలి దశ సామాజిక న్యాయ బస్సు యాత్రకు వైసీపీ అధినేత, సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 9వ తేదీ వరకు ఈ యాత్ర తొలిదశ సాగనుంది.
దీంతో పలు నియోజకవర్గాల్లో బస్సులు ఏర్పాటు చేసుకుని మంత్రుల నుంచి నాయకుల వరకు కూడా ప్రజల మధ్యకు వస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రజలు చేసిన మేళ్లు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు చేసిన మేళ్లను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, ఆధిపత్య పోరు కారణంగా.. ఈ యాత్రలు ఎక్కడికక్కడ నాయకులు లేక బోసిపోతున్నాయనే వాదన వైసీపీలోనే వినిపిస్తోంది.
నిజానికి.. టీడీపీ చేపట్టి భరోసాయాత్రలకు దీటుగా వైసీపీ ఈయాత్రలను సక్సెస్ చేయాలని నిర్ణయించిం ది. కానీ, ప్రజల మాట ఎలా ఉన్నా.. సొంత పార్టీలోనే నాయకుల మధ్య ఉన్న విభేదాలతో ఎక్కడా కూడా యాత్రల్లో వారు కనిపించడం లేదు. దీంతో డ్వాక్రా మహిళలు, పొదుపు సంఘాల మహిళలతో ఈ యాత్రలను నిర్వహిస్తున్నారు. అవి కూడా సక్సెస్ కాకపోవడం గమనార్హం. ప్రధానంగా గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకుపై వైసీపీ దృష్టి పెట్టింది. దీంతో యాత్రలను గ్రామీణ, మండల స్థాయిలో జోరుగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
ఈ క్రమంలో నాయకులు, మంత్రులు కూడా గ్రామీణ, పట్టణ స్థాయిలో బస్సు యాత్రలు చేస్తున్నారు. అయితే.. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా.. వైసీపీ సర్కారు తమ నిధులను కూడా వాడుకుంటోందని వైసీపీ మద్దతుదారులుగా ఉన్న సర్పంచులు, కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వారంతా.. ముందు మా సంగతి తేల్చండి.. తర్వాత.. యాత్రలు చేద్దురుగానీ అంటూ.. నాయకులకు తేల్చి చెబుతున్నారు. దీంతో యాత్రలకు వారంతా దూరంగా ఉంటున్నారు.
ఇక, యాత్రలు నిర్వహించి తీరాలన్న అధిష్టానం షరతుఓవైపు.. మాకు నిధులు ఇవ్వరు.. ఉన్నవి కూడా వాడుకుంటున్నారనే నాయకులు మరోవైపు.. ఇంకోవైపు అంతర్గత కుమ్ములాటలు.. వెరసి సామాజిక న్యాయ బస్సు యాత్రలు తస్సు మంటున్నాయి. మొత్తానికి వైసీపీ అధినేత ఒకటి తలిస్తే.. మరొకటి జరుగుతోందని అంటున్నారు వైసీపీ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో . మరి ఎన్నికల నాటికి ఏం చేస్తారో చూడాలి.