పట్టాభి . ఈ మూడు అక్షరాలు.. వైసీపీ నేతల మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. పార్టీ కీలకనాయకుడు విజయసాయిరెడ్డి అయితే.. తరచుగా ఈయనపై కామెంట్లుకూడా చేస్తున్నారు. దీనికి కారణం.. లెక్కలు, పత్రాలతో సహా ప్రభుత్వాన్ని కార్నర్ చేయడ మే. టీడీపీ అదికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరాం.. గత ఏడాది ప్రారంభం నుంచి కూడా జోరుగా ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అనేక విషయాల్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సర్కారును ఇరుకున పెట్టాయి.
పెట్టుబడుల నుంచి విజయసాయిరెడ్డి విశాఖలో భూములు దోచేస్తున్నారని కూడా విరుచుకుపడ్డారు. అదేసమయంలో సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై చేసిన దాడులను కూడా ఎవరెవరు చేశారో.. ఆధారాలతో సహా పట్టాభి బయటకు చెప్పారు. దీంతో అప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం పట్టాభిని టార్గెట్ చేసింది. గతంలోనే ఒకసారి.. `బోషడీకే` అన్న మాట తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై సీఎం జగనే తీవ్రస్థాయిలో ఆవేదన , ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒకసారి ఆయనను అరెస్టు చేశారు.
అయితే.. అప్పట్లో ఏమైందో ఏమో కానీ.. పట్టాభి బయటకు వచ్చేశారు. ఇక, అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. లేకపోతే.. అప్పటి వరకు నిత్యం ఆయన మీడియాతో ఉండేవారు. ఏదో ఒక విమర్శ చేసేవారు. అయితే.. తొలి కేసు ఎఫెక్ట్‌తో మళ్లీ తగ్గిపోయారు. అయితే.. అనూహ్యంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి .. వైసీపీ సర్కారు ఆయనను అరెస్టు చేసింది. అయితే.. ఈ సారి ఏకంగా హత్యాయత్నం చేసులతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టడం గమనార్హం.
మొత్తంగా చూస్తే.. టార్గెట్ పట్టాభి! అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈ పోరులో టీడీపీ గెలుస్తుందా? ఓడుతుందా? అనేది పక్కన పెట్టినా.. ఒక విషయం మాత్రం చర్చకు వస్తోంది. బలమైన గళాన్ని వైసీపీ ఇక, ఎదగనిచ్చే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ.. దీనికి సంబంధించి ఉన్న అన్నిదారులను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో పట్టాభి వంటి టార్గెట్ అయ్యారని చెబుతున్నారు.