తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్యవేడులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న లోకేశ్…జగన్, వైసీపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు.
పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కావాలని, ప్రధాని మోడీని చూసి ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదని వైసీపీ ఎంపీలనుద్దేశించి లోకేశ్ ఎద్దేవా చేశారు. పనికిమాలినోళ్లను గుంపుగా పార్లమెంటుకు పంపినా ఏమీ సాధించలేకపోయారని చురకలంటించారు. వైసీపీ తరఫున 21 మంది ఎంపీలు లోక్సభలో, ఆరుగురు ఎంపీలు రాజ్యసభలో ఉండి ఏం సాధించారని లోకేశ్ ప్రశ్నించారు.
కేంద్రం చెప్పినట్లు తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం లేదని, పార్లమెంట్లో సింహాల్లా పోరాడుతున్న ముగ్గురు టీడీపీ ఎంపీలకు తోడుగా మరో ఎంపీని పంపాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న పనబాక లక్ష్మిని గెలిపించాలని, పార్లమెంట్లో గర్జించే మీ ఇంటి లక్ష్మి కావాలో?.. పార్లమెంట్లో పడుకొని జగన్ రెడ్డి పాదసేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోవాలని లోకేశ్ వ్యాఖ్యానించారు.
పనబాక గెలుపుతో ఆకాశంలో ఉన్న జగన్ ని భూమ్మీదకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రోడ్ షో సందర్భంగా లోకేశ్ చేసిన పనికి అక్కడి ప్రజలు ఫిదా అయ్యారు. లోకేశ్ ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి అజాన్ వినిపించగా…లోకేశ్ తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. అజాన్ పూర్తయ్యేవరకు మౌనంగా ఉన్న లోకేశ్ కార్యకర్తలను కూడా మౌనంగా ఉండాలని వారించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.