ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రఘురామను స్పీకర్ ఛైర్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూర్చోబెట్టారు. రఘురామకు వారు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే రఘురామకు టీడీపీ, జనసేన, బిజెపి నేతలు శుభాకాంక్షలు తెతిపారు. అయితే, అనూహ్యంగా రఘురామకు వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన వైనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ కు గురైన రఘురామను మచ్చిక చేసుకునేందుకు విజయ సాయి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనలు మరచిపోవాలని, స్పీకర్ పదవికి ఉన్న హుందాతనాన్ని కాపాడాలని నీతి పలుకులు పలుకుతున్నారని అంటున్నారు. పొరపాటున అసెంబ్లీకి జగన్ వస్తే డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామ ఓ ఆట ఆడుకుంటారని, అందుకే రఘురామతో ఇప్పుడు సంధి కుదుర్చుకునేందుకు సాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఆనాడు రఘురామను ఇబ్బంది పెట్టినప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్లారని, ఇది తప్పు అని చెప్పి ఆపి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదని, ఇప్పుడు రాజీకి వచ్చినా ఫలితం లేదని కామెంట్లు పెడుతున్నారు.